సత్తెనపల్లి కేంద్రీయ విద్యాలయంలో కొత్తగా ఇంటర్ కోర్సు.. కేంద్రం ఉత్తర్వులు

Wait 5 sec.

విద్యార్థులకు శుభవార్త.. పల్నాడు జిల్లా కేంద్రీయ విద్యాలయంలో ఇంటర్మీడియట్ కోర్సుల నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. సత్తెనపల్లి కేంద్రీయ విద్యాలయంలో ఇప్పటి వరకూ పదో తరగతి వరకూ మాత్రమే తరగతులు నిర్వహిస్తున్నారు. అయితే తాజాగా ఇంటర్మీడియట్ కోర్సు నిర్వహణకు కేంద్రం అనుమతి ఇచ్చింది. ఈ విషయాన్ని టీడీపీ ఎంపీ వెల్లడించారు. ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. సత్తెనపల్లి కేంద్రీయ విద్యాలయానికి ఇంటర్మీడియట్ మంజూరైందని.. దీనితోపాటుగా మరింత మంది విద్యార్థులకు లబ్ధి చేకూరేలా సత్తెనపల్లి, చిలకలూరిపేటలోని ఇర్లపాడు కేంద్రీయ విద్యాలయానికి అదనపు సెక్షన్లు కూడా మంజూరైనట్లు లావు శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులు కేంద్ర మంత్రిత్వ శాఖ విడుదల చేసినట్లు వివరించారు.సత్తెనపల్లి కేంద్రీయ విద్యాలయానికి ఇంటర్మీడియట్ మంజూరు కోసం తాను, సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మినారాయణ ఎంతగానో కృషి చేశామని.. త్వరగా ఫలితం వచ్చిందన్నారు. మరోవైపు మరింత విద్యార్థులకు విద్య అందించేందుకు అదనపు సెక్షన్లు మంజూరైనట్లు ఎంపీ వెల్లడించారు.సత్తెనపల్లి కేంద్రీయ విద్యాలయంలో నాలుగు, ఐదో తరగతులకు ఒక్కో అదనపు సెక్షన్ మంజూరైందన్నారు. సెక్షన్‌కు 40 మంది విద్యార్థులకు అవకాశం వస్తుందని వివరించారు. ఇర్లపాడు కేంద్రీయ విద్యాలయంలో 3, 4, 5 తరగతులకు గానూ ఒక్కో అదనపు సెక్షన్ మంజూరైందని వెల్లడించారు. విద్యార్థులు నాణ్యమైన విద్యను చదువుకునేందుకు వారికి విద్యా అవకాశాలు మెరుగుపరిచేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు, విద్యార్థులకు సౌకర్యాలు మెరుగుపరచటంలో కృషి చేస్తామని తెలిపారు. సత్తెనపల్లి కేంద్రీయ విద్యాలయంలో 2017 నుంచి తరగతులు ప్రారంభమయ్యాయి. సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) సిలబస్ ఆధారంగా ఇక్కడ బోధన ఉంటుంది. విద్యార్థులు అన్ని రంగాలలో మెరుగుపడేలా విద్యాబోధన అందిస్తారు. ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన జరుగుతుంది. అలాగే హిందీ, ఇతర ప్రాంతీయ భాషలను కూడా నేర్పిస్తారు. అయితే ఇప్పటి వరకూ పదో తరగతి వరకూ మాత్రమే విద్యాబోధన జరిగేది. తాజాగా ఇంటర్మీడియట్ కోర్సుల నిర్వహణకు కూడా కేంద్రం అనుమతి ఇవ్వటంతో విద్యార్థులకు ఉపయోగకరంగా ఉండనుంది. అలాగే అదనపు సెక్షన్లు మంజూరు చేయటంతో మరింత మంది విద్యార్థులకు అవకాశం దక్కనుంది.