TG Budget 2026 Live Updates: రూ.3.30 లక్షల కోట్లతో తెలంగాణ బడ్జెట్..? ఈ శాఖలకు అధిక కేటాయింపులు..!

Wait 5 sec.

: తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌ను నేడు ప్రవేశపెట్టనున్నారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను ఇవాళ ఉదయం 11 గంటలకు డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క శాసనసభలో బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. శాసన మండలిలో ఐటీ మంత్రి శ్రీధర్ బాబు ప్రవేశపెట్టనున్నారు. అంతకుముందు ఉదయం 9 గంటలకు అసెంబ్లీ కమిటీ హాలులో కేబినెట్ సమావేశం నిర్వహించి బడ్జెట్‌ను ఆమోదించనున్నారు. ఈ ఏడాది బడ్జెట్ 3.30 లక్షల కోట్లుగా ఉండనుందని అంచనా. విద్య, వైద్యం, వ్యవసాయానికి ప్రాధాన్యం ఉంటుందని, ఇరిగేషన్ ప్రాజెక్టులకు రూ.26 వేల కోట్లు కేటాయించవచ్చుని సమాచారం. బడ్జెట్‌ ప్రవేశపెట్టగా.. ఈసారి రూ.3.29 లక్షల కోట్ల నుంచి రూ.3.30 లక్షల కోట్ల వరకు పెంచే అవకాశం ఉందని అధికారిక వర్గాల సమాచారం. ప్రజా సంక్షేమ పథకాలతో పాటు మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ మేరకు కసరత్తు చేస్తోంది. రాష్ట్ర అభివృద్ధిలో కీలకమైన మూలధన వ్యయాన్ని ఈసారి గణనీయంగా పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. గత బడ్జెట్‌లో మూలధన వ్యయం కింద రూ.36,504 కోట్లు కేటాయించగా.. ఈసారి దీనిని రూ.45 వేల కోట్ల వరకు పెంచే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్లు, సాగునీటి ప్రాజెక్టులు, యంగ్ ఇండియా స్కూల్స్ వంటి ప్రతిష్టాత్మక పథకాలకు భారీగా నిధులు అవసరమవుతాయని అంచనా. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం సుమారు రూ.29 వేల కోట్లు అవసరమని గృహనిర్మాణ శాఖ ప్రతిపాదనలు పంపింది. గత ఏడాది ఈ పథకానికి రూ.12,571 కోట్లు కేటాయించగా.. ఈసారి ఆ మొత్తాన్ని రూ.17 వేల కోట్ల వరకు పెంచే అవకాశం ఉంది. వ్యవసాయం, విద్య, వైద్య రంగాలకు కూడా ప్రాధాన్యత ఇస్తూ బడ్జెట్ రూపకల్పన చేసినట్లు సమాచారం. కీలక శాఖలకు భారీ కేటాయింపుల ద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని తెలంగాణ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.