ఆంధ్రప్రదేశ్‌లో రంజాన్ సెలవు మారింది. ఈ నెల 21న ఈద్‌-ఉల్‌-ఫితర్‌ (రంజాన్‌) సందర్భంగా సాధారణ సెలవు ప్రకటించారు. ఈ మేరకు ప్రభుత్వం గురువారం అర్ధరాత్రి తర్వాత ఉత్తర్వులు జారీ చేసింది. వాస్తవానికి ఏపీ ప్రభుత్వం ముందుగా జారీ చేసిన సాధారణ సెలవుల జాబితా ప్రకారం.. ఈ నెల 20వ తేదీన రంజాన్‌ సెలవుగా ప్రకటించారు. అయితే రాష్ట్ర వక్ఫ్‌ బోర్డు సీఈవో నుంచి.. నెల వంక దర్శనం ఆధారంగా రంజాన్‌ పండగ శనివారం వస్తుందని ప్రభుత్వానికి లేఖ అందింది. ఈ క్రమంలోఈ నెల 20 బదులు 21వ తేదీ సాధారణ సెలవుగా ప్రకటిస్తూ సీఎస్ జి సాయిప్రసాద్‌ ఉత్తర్వులు జారీ చేశారు.రంజాన్ సెలవు మారడంతో.. పదోతరగతి పరీక్షల షెడ్యూల్‌లో మార్పు చేశారు. ఈ నెల 21న (శనివారం) నిర్వహించాల్సిన పదో తరగతి ఇంగ్లీష్ పరీక్షను ఏప్రిల్‌ 2వ తేదీకి వాయిదా వేశారు. వాస్తవానికి ప్రభుత్వ పరీక్షల విభాగం ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఇంగ్లీష్ పరీక్ష శుక్రవారం (ఈ నెల 20న) జరగాల్సి ఉంది. అయితే ఈ నెల 20వ తేదీన రంజాన్‌ సెలవుగా నిర్ణయించారు.. దీంతో ఇంగ్లీష్ పరీక్షను ఈ నెల 21న నిర్వహించాలని నిర్ణయించారు. అయితే తాజాగా రంజాన్‌ సెలవు శనివారానికి (ఈ నెల 21కు) మారడంతో ఇంగ్లీష్ పరీక్షను అన్ని పరీక్షలు ముగిసిన తర్వాత ఏప్రిల్‌ 2వ తేదీన నిర్వహించనున్నారు. ఏపీ ప్రభుత్వం తాజా నిర్ణయంతో.. శుక్రవారం ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు, విద్యాసంస్థలు యథావిధిగా పనిచేయనున్నాయి. 'రంజాన్ ఈ నెల 21న నిర్వహించాలని నిర్ణయించారు.. ఈ కారణంగా శనివారం జరగాల్సిన పరీక్షలు రీషెడ్యూల్ చేశారు. ఇంటర్ ఫస్టియర్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పరీక్షను ఈ నెల 21 తేదీన కాకుండా ఈ నెల 25వ తేదీ నిర్వహిస్తారు. పదో తరగతి పరీక్షలకు సంబంధించి ఇంగ్లీష్ పరీక్షను కూడా ఈ నెల 21న కాకుండా ఏప్రిల్ 2వ తేదీకి వాయిదా వేశాము. మిగిలిన పరీక్షలు ఆయా షెడ్యూ్‌ల్‌ను బట్టి మార్పులు చేసి నిర్వహిస్తారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, అధికారులు ఈ మార్పును గమనించాలి' అని మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు.