డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లపై సర్కార్ స్పెషల్ ఫోకస్.. అలా ఉంటే ఇళ్లు వెనక్కి, ఖాళీ చేయాల్సిందే..!

Wait 5 sec.

అర్హులైన పేదలకే సంక్షేమ ఫలాలు అందే విధంగా రేవంత్ సర్కార్ కఠిన నిర్ణయాలు తీసుకుంటుంది. ఎటువంటి రాజకీయ వివక్షలకు తావులేకుండా అర్హులైన వారికి పథకాలు అందేలా చర్యలుచ చేపట్టింది. అందులో భాగంగా.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నిరుపేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు నిర్మించిన ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇళ్లు మంజూరైనప్పటికీ.. వాటిలో నివసించకుండా ఖాళీగా వదిలేసిన లబ్ధిదారుల నుంచి ఆ ఇళ్లను వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వం డిసైడ్ అయింది. రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశాల మేరకు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల కలెక్టర్లు అలాంటి ఇళ్లపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. అర్హులై ఉండి, ఇందిరమ్మ ఇళ్లలో నివాసం ఉండని వారికి తొలుత నోటీసులు జారీ చేసి.. ఆ తర్వాత ఆ ఇళ్లను స్వాధీనం చేసుకుని ఇందిరమ్మ ఇళ్ల L-2 జాబితాలో ఉన్న ఇతర అర్హులైన పేదలకు కేటాయించనున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని 17 ప్రాంతాల్లో మూడేళ్ల క్రితమే లబ్ధిదారులకు అందజేశారు. అయితే నగర శివారు ప్రాంతాల్లో ఉండటం, సరైన మౌలిక సదుపాయాలు లేకపోవడంతో దాదాపు 40 శాతం మంది లబ్ధిదారులు ఈ ఇళ్లలో ప్రస్తుతం నివాసం ఉండటం లేదు. గత రెండేళ్లుగా ప్రభుత్వం కోట్ల రూపాయల వ్యయంతో విద్యుత్, తాగునీరు, అనుసంధాన రహదారుల వంటి సౌకర్యాలను కల్పించినప్పటికీ ఇంకా 8 వేల మంది లబ్ధిదారులు తమ ఇళ్లను తాళం వేసి ఉంచినట్లు గుర్తించారు. అర్హులైన వేలాది మంది పేదలు ఇళ్ల కోసం ఎదురుచూస్తుంటే కేటాయించిన ఇళ్లను నిరుపయోగంగా ఉంచడం సరికాదని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నెలాఖరులోపు ఖాళీగా ఉన్నా, లేదా అద్దెకు ఇచ్చిన ఇళ్ల స్వాధీన ప్రక్రియను పూర్తి చేసి, కొత్త లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆయా కాలనీలను నివాసయోగ్యంగా మార్చేందుకు ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపడుతోంది. విద్యుత్ దీపాలు, తాగునీటి నల్లాలు బిగించే పనులను పగలు, రాత్రి తేడా లేకుండా పూర్తి చేస్తున్నారు. అలాగే, ఈ సముదాయాల్లో ఉన్న ఖాళీ దుకాణాలను బహిరంగ వేలం వేయాలని డిసైడ్ అయ్యారు. ఈ వేలం ద్వారా వచ్చే ఆదాయాన్ని సదరు కాలనీల నిర్వహణ, అభివృద్ధి పనులకే వెచ్చించనున్నారు.