తెలంగాణకు హైదరాబాద్ వాతావరణశాఖ జారీ చేసింది. కర్ణాటక, తమిళనాడు మీదుగా కొమరిన్‌ ప్రాంతం వరకు ఏర్పడిన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని చెప్పింది. నేడు, రేపు (మంగళ, బుధవారాల్లో) చాలా జిల్లాల్లో ఉరుములు, మెరుపులు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా దక్షిణ తెలంగాణ, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని చెబుతున్నారు. గంటకు 40 నుంచి 50 కి.మీ. వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని అంటున్నారు. ఈ గాలుల కారణంగా పంటలకు, తోటలకు నష్టం వాటిళ్లే ప్రమాదముందని జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఇక సోమవారం రాష్ట్రంలో పలుచోట్ల తేలికపాటి వర్షాలు కురిశాయి. కుమురంభీం ఆసిఫాబాద్, నిర్మల్, మహబూబ్‌నగర్, యాదాద్రి భువనగిరి, మేడ్చల్‌ మల్కాజిగిరి, నారాయణపేట, వికారాబాద్‌, సంగారెడ్డి, కామారెడ్డి, మెదక్, నిజామాబాద్ తదితర జిల్లాల్లో పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన జల్లులు కురిశాయి. సంగారెడ్డి జిల్లా వట్పల్లి మండలంలో రాష్ట్రంలోనే అత్యధికంగా 6.4 సెం.మీ. వర్షపాతం నమోదైనట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. హైదరాబాద్ నగరంలోనూ వాతావరణం ఆహ్లదకరంగా మారింది. సోమవారం సాయంత్రం పలు ప్రాంతాల్లో జల్లులు కురిశాయి. అకాల వర్షాలతో రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా దిగువకు పడిపోయాయి. ఈ ఏడాది ఫిబ్రవరి రెండో వారం నుంచి భానుడి భగభగలు మెుదలయ్యాయి. చాలా జిల్లాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే మార్చి మెుదటి వారంలోనే 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ తీవ్రమైన ఎండలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉక్కపోత, ఎండలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అలాంటి సమయంలో ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు కాస్త ఉపశమనం కలిగిస్తున్నాయి. వచ్చే వారం రోజుల పాటు రాష్ట్రంలో పొడి వాతావరణం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఆ తర్వాత మళ్లీ భానుడి ప్రతాపం మెుదలవుతుందని అంటున్నారు. ఇక ఈ ఏడాది వడగాల్పుల ప్రభావం ఎక్కువగా ఉంటుందని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ నిపుణులు హెచ్చరిస్తున్నారు.