ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు బంపరాఫర్ ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌లలో ఇస్తోంది. ఈ నెలాఖరులోగా ఆస్తిపన్ను బకాయిలను కనుక చెల్లిస్తే.. ఆ బకాయిలపై విధించే వడ్డీలో ఏకంగా 50 శాతం రాయితీ ఇవ్వాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొన్నటి వరకు రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌లు ఈ బకాయిలను వడ్డీతో వసూలు చేసేవి. అయితే ఆర్థిక సంవత్సరం ముగియనుండటంతో ప్రతి ఏటా ఇచ్చినట్లుగానే ఈసారి కూడా వడ్డీలో 50శాతం రాయితీ ఇవ్వాలని నిర్ణయించారు.. ఈ మేరకు వడ్డీ తగ్గింపు ప్రతిపాదనకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో ఆస్తి పన్నులు పేరుకుపోయాయి.. ఆ బకాయిలను వసూలు చేసేందుకు వడ్డీని మాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ జీవో నంబర్ 58ను 16-03-2026 తేదీన విడుదల చేసింది. ఈ పథకం ద్వారా వేలాది మంది పన్ను చెల్లింపుదారులకు ఊరట లభించనుంది. గతేడాది మార్చిలో కూడా ఏపీ ప్రభుత్వం ఆస్తిపన్నుపై వడ్డీలో 50 శాతం రాయితీ ప్రకటించింది. ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. దీంతో ఈ ఏడాది కూడా 50శాతం రాయితీ ప్రకటించారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా 86 మున్సిపల్, కార్పొరేషన్లలో పాలకవర్గాల పదవీకాలం నేటితో ముగుస్తోంది. బుధవారం నుంచి ప్రత్యేక అధికారుల పాలన పూర్తిస్థాయిలో ప్రారంభమవుతుంది. గత ప్రభుత్వ హయాంలో 2021 మార్చిలో ఎన్నికలు నిర్వహించారు.. అప్పటి ఎన్నికల్లో గెలిచిన కార్పొరేటర్లు, కౌన్సిలర్లతో పాలకవర్గాలు కొలువుదీరాయి. వీరి పదవీకాలంలో నేటితో ముగుస్తోంది.. ప్రభుత్వం ఈ మేరకు వారం క్రితమే ప్రత్యేక అధికారులను నియమించిన సంగతి తెలిసిందే. ఇవాళ, బుధవారాల్లో అధికారులు బాధ్యతలు చేపట్టనున్నారు. కార్పొరేషన్‌లలో ప్రత్యేక అధికారులుగా కలెక్టర్లు, మున్సిపాలిటీల్లో జాయింట్‌ కలెక్టర్లు, ఆర్డీవోలను ప్రత్యేక అధికారుల్ని నియమించింది. ఏలూరు కార్పొరేషన్ పాలకవర్గం పదవీ కాలం మాత్రం ఈ ఏడాది జులై 29తో ముగుస్తుంది. మరికొన్ని మున్సిపాలిటీలు,నగర పంచాయతీల్లో పాలకవర్గాల పదవీ కాలం ఈ ఏడాది నవంబరు 21తో ముగియనుంది.