అప్ఘనిస్తాన్ రాజధాని కాబూల్‌లో జరిగిన భయానక ఎయిర్‌స్ట్రైక్ ఘటన అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది. ఈ ఘటనపై అప్ఘన్ స్టార్ స్పిన్నర్, మాజీ కెప్టెన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ పాకిస్తాన్‌పై మండిపడ్డాడు. డ్రగ్ రిహాబ్ హాస్పిటల్ లక్ష్యంగా జరిగిన ఈ దాడిలో భారీ ప్రాణ నష్టం సంభవించింది. అఫ్ఘనిస్తాన్ అధికారిక వివరాల ప్రకారం ఇప్పటివరకు మరణాల సంఖ్య 400కు చేరినట్లు ధృవీకరించారు. 250 మందికి పైగా గాయపడినట్లు సమాచారం. ఈ ఘటనపై స్పందించిన రషీద్ ఖాన్ ఎలాంటి సందేహం లేకుండా తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. “పౌరుల ఇళ్లపై, విద్యాసంస్థలపై లేదా వైద్య సదుపాయాలపై దాడి చేయడం అది ఉద్దేశపూర్వకమైనదైనా, పొరపాటున జరిగినదైనా, అది వార్ క్రైమ్‌గానే పరిగణించాలి” అని స్పష్టం చేశాడు.ప్రస్తుతం పవిత్రమైన రంజాన్ నెలలో ఇలాంటి ఘటన జరగడం మరింత ఆందోళన కలిగిస్తోందని రషీద్ పేర్కొన్నాడు. “మనుషుల ప్రాణాలపై ఇంత నిర్లక్ష్యం చూపించడం చాలా బాధాకరం, ఆందోళన కలిగించే విషయం” అని తన సోషల్ మీడియా వేదికలో పేర్కొన్నాడు. ఈ దాడి సమాజంలో విభేదాలను, ద్వేషాన్ని మరింత పెంచుతుందని రషీద్ ఖాన్ హెచ్చరించాడు. అంతేకాకుండా ఈ ఘటనపై యునైటెడ్ నేషన్స్‌తో పాటు ఇతర మానవ హక్కుల సంస్థలు తక్షణమే దర్యాప్తు చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరాడు. “ఈ కఠిన సమయంలో నా అప్ఘన్ ప్రజలతో నేనున్నాను. మేము మళ్లీ కోలుకుంటాం, దేశంగా ఎదుగుతాం” అని భావోద్వేగంగా పేర్కొన్నాడు.ఇదే ఘటనపై అప్ఘనిస్తాన్ సీనియర్ ఆల్‌రౌండర్ కూడా స్పందించాడు. ఆస్పత్రిలో చికిత్స కోసం వచ్చిన యువకులు ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయారని ఆయన పేర్కొంటూ “ఈ రాత్రి కాబూల్‌లో ఆశలు చంపబడ్డాయి. తమ పిల్లల కోసం తల్లులు గేట్ల వద్ద ఎదురు చూసిన దృశ్యం హృదయ విదారకం” అని పోస్ట్ చేశాడు. రంజాన్ 28వ రాత్రి జరిగిన ఈ ఘటనలో అమాయకుల ప్రాణాలు కోల్పోవడం ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆవేదన కలిగిస్తోంది. ఈ ఘటనపై అంతర్జాతీయ సమాజం ఎలా స్పందిస్తుందన్నది ఇప్పుడు కీలకంగా మారింది.