'కారణాలు వేరే ఉన్నాయి'.. కొందరి ఇళ్లనే హైడ్రా కూల్చివేయడంపై ఏవీ రంగనాథ్ క్లారిటీ

Wait 5 sec.

హైదరాబాద్ నగరంలో కూల్చివేతలపై ఎంత హర్షం వ్యక్తం అవుతోందో అందరికీ తెలిసిందే. నాలాలు, చెరువులు, ప్రభుత్వ స్థలాలు, పార్కులను ఆక్రమించి నిర్మించిన కట్టడాలపై ఉక్కుపాదం మోపుతున్న తెలంగాణ సర్కార్.. బుల్డోజర్లతో కూల్చివేస్తోంది. అయితే హైడ్రా కూల్చివేతలపై ఎంత సానుకూలత వ్యక్తం అవుతుందో.. అంతకంటే ఎక్కువ వ్యతిరేకత రావడంతో.. తీవ్ర వివాదాస్పదం అవుతున్నాయి. హైడ్రా అధికారులు.. కేవలం సామాన్యుల ఇళ్లను మాత్రమే కూల్చేస్తున్నారని.. పెద్ద వాళ్ల ఇళ్లను వదిలేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై క్లారిటీ ఇచ్చారు. పర్మిషన్ ఉన్న బిల్డింగ్‌లను ఎక్కడా హైడ్రా అధికారులు కూల్చలేదని ఏవీ రంగనాథ్ స్పష్టం చేశారు. అక్రమంగా పర్మిషన్లు తీసుకుని నిర్మించిన భవనాలను మాత్రమే కూల్చివేశామని.. అలాంటి పర్మిషన్లు ఇచ్చిన వారితోపాటు తీసుకున్న వారిది కూడా తప్పేనని తేల్చి చెప్పారు. ఏడాదిన్నర క్రితం సున్నం చెరువు వద్ద కొన్ని నిర్మాణాలను కూల్చేశామని.. సెలక్టివ్‌గా వెళ్లడానికి వేరే కారణాలు ఉంటాయని వెల్లడించారు. హైడ్రా బస్తీల జోలికి వెళ్లడం లేదని.. ముందు షెడ్లు నిర్మించి.. ఆ తర్వాత కబ్జాలు చేయాలని అనుకునే వారి జోలికే వెళ్తున్నామని స్పష్టం చేశారు. హైడ్రాకు నెగిటివ్ ఇమేజ్ వస్తుందన్న వార్తలపై స్పందించిన ఏవీ రంగనాథ్.. కూల్చడాన్ని ఎప్పుడైనా నెగటివ్‌గానే చూస్తారని.. రోడ్ల విస్తరణను కూడా ప్రతికూలంగానే చూస్తారని పేర్కొన్నారు. కానీ ఆ తర్వాత వాటిని ఉపయోగించడం మొదలైన తర్వాత సానుకూలత వస్తుందని తెలిపారు. చెరువుల సుందరీకరణ పేరుతో పేదలను నష్టపర్చడం కాదని.. చెరువులను ఆక్రమించడం వల్ల బాగుపడిన పేదలు ఎంత మంది ఉన్నారని హైడ్రా కమిషనర్ స్పష్టం చేశారు. కబ్జాల నుంచి చెరువులను కాపాడటం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి రూ.60 వేల కోట్లు ఆదా చేసినట్లు చెప్పారు. చెరువుల కబ్జాలను ఆపేందుకు సంస్కరణలను ఎప్పుడో ఒక చోట మొదలుపెట్టాలని.. హైదరాబాద్ నగరంలో 61 శాతం చెరువులు కనుమరుగు అయ్యాయని నేషనల్ రిమోట్ సెన్సింగ్ నివేదిక ఇచ్చినట్లు చెప్పారు. హైడ్రా కూల్చివేతలకు సంబంధించిన ఫలాలు భవిష్యత్‌లో ప్రజలకు తెలుస్తాయని పేర్కొన్నారు.