తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని పేదలు, వృద్ధులు, అభాగ్యులకు తీపి కబురు అందించింది. అసెంబ్లీలో ప్రవేశపెట్టిన 2026-27 వార్షిక బడ్జెట్‌ ప్రసంగంలో భాగంగా డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క కీలక ప్రకటన చేశారు. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా మరో 2 లక్షల మందికి 'చేయూత' పింఛన్లను మంజూరు చేయనున్నట్లు ప్రకటించారు. గత కొంతకాలంగా పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న అర్హులైన లబ్ధిదారులకు ఈ నిర్ణయంతో ఊరట లభించినట్లయింది.సంక్షేమమే ధ్యేయంగా తమ ప్రభుత్వం అడుగులు వేస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్కమార్క వెల్లడించారు. బడ్జెట్‌లో .. క్షేత్రస్థాయిలో సామాన్యుడికి లబ్ధి చేకూర్చడమే లక్ష్యంగా నిధుల కేటాయింపులు జరిగాయని వివరించారు. ఈ కొత్త పింఛన్ల పంపిణీకి ఎటువంటి ఆటంకాలు కలగకుండా బడ్జెట్‌లో భారీగా నిధులను కేటాయించామన్నారు. ఇప్పటికే పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను అధికారులు గ్రామ, వార్డు స్థాయిలో పరిశీలించనున్నట్లు తెలిపారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పారదర్శకంగా ఈ సామాజిక భద్రతా పింఛన్లను ప్రభుత్వం అందజేస్తుందన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి నిరుపేదల కళ్లలో ఆనందం చూడాలని తపిస్తోందని.. ఈ అదనపు పింఛన్ల మంజూరుతో లక్షలాది కుటుంబాల్లో కొత్త వెలుగులు నిండుతాయని తామ ఆశిస్తున్నామని చెప్పారు. సంక్షేమ పథకాలను పకడ్బందీగా అమలు చేస్తూ.. అర్హులందరికీ న్యాయం చేయడమే ప్రభుత్వ ప్రాధాన్యత అని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పింఛన్ లబ్ధిదారులకు తోడుగా.. కొత్తగా 2 లక్షల మందికి ఫించన్లు ఇస్తామన్నారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఇతర చేతివృత్తుల వారు ఈ 'చేయూత' పథకం ద్వారా ఆర్థిక భరోసా పొందనున్నట్లు చెప్పారు. ఈ ఏడాది మెుత్తం రూ.3,24,234 లక్షల కోట్లతో అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఇందులో రెవెన్యూ వ్యయం రూ.2,34,406 లక్షల కోట్లు కాగా.. మూలదన వ్యయం రూ. 47, 267 వేల కోట్లుగా వెల్లడించారు.. కీలక శాఖలకు ప్రాధాన్యం ఇస్తూ అధికంగా నిధులను కేటాయించారు.