తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్‌‌ రాజకీయ ప్రవేశం గురించినేత వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. తాజాగా, ఈ వ్యాఖ్యలపై స్పందించిన రజనీకాంత్‌.. ఇదంతా తప్పుడు ప్రచారమని తేల్చి చెప్పారు. అన్నింటికీ కాలమే సమాధానం చెబుతుందని తలైవా అన్నారు. తమిళగ వెట్రి కళగం () పార్టీ ప్రధాన కార్యదర్శి ఆదవ్‌ అర్జున ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. రజనీకాంత్ రాజకీయ ప్రవేశానికి రంగం సిద్ధం చేసుకున్న సమయంలో ఆయనపై డీఎంకే బెదిరింపులకు పాల్పడిందని, అందుకే వెనక్కి తగ్గారని ఆరోపించారు. అయితే, ఇలాంటి ఒత్తిళ్లకు తమ నాయకుడు విజయ్ తలొగ్గరని ఆదవ్ వ్యాఖ్యానించారు.ఈ వ్యాఖ్యలపై రజనీకాంత్‌ అభిమానులు, డీఎంకేతో పాటు అన్నాడీఎం సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఆదవ్ అర్జున్ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ‘‘ ఉన్నతస్థాయి నేత నాపై చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవం.. ఆయన వ్యాఖ్యలను ఖండిస్తూ నాకు మద్దతుగా నిలిచిన అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు... కానీ, నేను చెప్పేది ఒక్కటే.. కాలం మాట్లాడకపోవచ్చు కానీ, సరైన సమయంలో అన్నింటికీ సమాధానం ఇస్తుంది’’ అని ఎక్స్ (ట్విట్టర్)లో పోస్ట్ పెట్టారు.కాగా, గత తమిళనాడు ఎన్నికలకు ముందు రజినీ రాజకీయ అరంగేట్రంపై ముమ్మర ప్రచారం జరిగింది. ‘రజనీ మక్కళ్‌ మండ్రం’ అనే పేరుతో తలైవా పార్టీ ఏర్పాటుచేస్తారనే వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ ఊహగానాలన్నింటికీ 2020లో రజినీ ముగింపు పలికారు. ఆరోగ్య కారణాల రీత్యా రాజకీయాల్లోకి వచ్చే ఆలోచనను విరమించుకున్నట్లు ప్రకటించారు. త్వరలోనే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల జరగనుండగా.. రజినీపై టీవీకే చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగుతోంది. ఇదే సమయంలో టీవీకే, బీజేపీ మధ్య పొత్తులకు దారులు దాదాపు మూసుకుపోయాయి. సూపర్‌స్టార్ రజనీకాంత్‌పై టీవీకే నేతలు చేసిన వ్యాఖ్యల వివాదమే ఇందుకు కారణం. టీవీకేపై అన్నాడీఎంకే, బీజేపీ నేతలు బహిరంగంగా విమర్శలు గుప్పిస్తున్నారు. గత కొద్ది వారాలుగా టీవీకేతో పొత్తుల కోసం బీజేపీ తెరవెనుక ప్రయత్నాలు కొనసాగిన విషయం తెలిసిందే. విజయ్‌కు డిప్యూటీ సీఎం పదవి, టీవీకేకు 80 సీట్లు ఇవ్వడానికి బీజేపీ సిద్ధమైనట్టు ప్రచారం జరిగింది. అయితే, దీనిని టీవీకే తోసిపుచ్చింది.తమిళనాడు అసెంబ్లీకి ఏప్రిల్ 23న ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. అక్కడ డీఎంకే నాయకత్వంలోని ఇండియా కూటమి, అన్నాడీఎంకే-బీజేపీలతో కూడిన ఎన్డీయే, విజయ్ పార్టీ మధ్య త్రిముఖ పోరు జరిగే అవకాశం ఉంది.