నెల్లూరులో దారుణం చోటు చేసుకుంది. నగర శివార్లలోని బుజబుజ హైవేపై కూల్ డ్రింక్స్ బాటిళ్లతో వెళ్తున్న ఓ లారీ ప్రమాదవశాత్తూ బోల్తా పడింది. దీంతో అక్కడ విస్తుపోయే సంఘటన చోటుచేసుకుంది. థమ్స్ అప్ లోడ్‌తో వెళ్తున్న ఈ లారీ డ్రైవర్ కంట్రోల్ తప్పడంతో రోడ్డు పక్కకు పల్టీ కొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో లారీలో ఉన్న కూల్‌డ్రింక్స్‌కు సంబంధించిన క్రేట్లు, బాటిళ్లు నడి రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. అయితే.. ప్రమాదానికి గురైన లాడీ డ్రైవర్ పరిస్థితి ఏంటి.. అతడిని ఆస్పత్రికి తరలించి కాపాడాల్సిన స్థానికులు.. మానవత్వాన్ని మర్చిపోయి థమ్స్ అప్ బాటిళ్ల కోసం ఎగబడ్డారు.లారీ బోల్తా పడిందని తెలియగానే చుట్టుపక్కల వారు, అటుగా వెళ్తున్న వాహనదారులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. డ్రైవర్ సాయం కోసం ఎదురుచూస్తున్నా అతడిని పట్టించుకోకుండా.. చేతికి దొరికినన్ని కూల్ డ్రింక్ బాటిళ్లను పట్టుకుని పరారయ్యారు. కొందరు సంచుల్లో నింపుకోగా, మరికొందరు చేతులతో బాటిళ్లను ఎత్తుకెళ్లారు. కేవలం 10 నిమిషాల వ్యవధిలోనే లారీలోని బాటిళ్ల స్టాక్ మొత్తం ఖాళీ అయిపోయింది. ఇక లారీ బోల్తా, జనాలు ఎగబడటంతో.. బుజబుజ నెల్లూరు జాతీయ రహదారిపై వాహనాలు నిలిచిపోవడంతో.. భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఒక వైపు లారీ బోల్తా పడటం.. మరోవైపు.. లారీలో ఉన్న సరుకు మొత్తం కళ్లముందే నిమిషాల వ్యవధిలోనే మాయం కావడంతో డ్రైవర్ లబోదిబోమని రోదించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ప్రమాదంలో ఉన్న వ్యక్తిని కాపాడాల్సింది పోయి, బాటిళ్ల కోసం ఇలా ఎగబడటంపై నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ప్రమాదం జరిగి.. రూ.లక్షల సరుకు రోడ్డు పాలు కావడంతో ఆ డ్రైవర్ బాధలో ఉంటే.. అతడ్ని కాపాడాల్సింది పోయి.. ఇలా కూల్‌డ్రింక్స్ బాటిళ్లు ఎత్తుకుపోవడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఇది మానవత్వానికి మాయని మచ్చగా నెటిజన్లు అభివర్ణిస్తున్నారు. ఫ్రీగా వస్తే గుంపులు గుంపులుగా ఎగబడే జనం.. ఎవరైనా ఆపదలో ఉన్నారంటే మాత్రం ఒక్క అడుగు కూాడా ముందుకు రారని పేర్కొంటున్నారు.