వేరే సామాజిక వర్గానికి చెందిన యువకుడితో కుమార్తెకు పెళ్లి సంబంధం ఖాయం చేసుకున్న మాజీ ఎమ్మెల్యేను ఆయన కులం పెద్దలు వెలేశారు. ఆయన కుటుంబాన్ని 12 ఏళ్ల పాటు బహిష్కరిస్తున్నట్టు ప్రకటించిన పెద్దలు.. వారికి ఎటువంటి సాయం చేయకూడదు, వారి ఇంట్లో జరిగే శుభకార్యాలకు కులపోళ్లు హాజరు కావద్దని ఆదేశించారు. విస్మయానికి గురిచేసే ఈ ఘటన ఒడిశాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. బీజేడీ నేత, నవరంగ్‌పూజ్ మాజీ ఎమ్మెల్యే సదా శివప్రధాన్‌ కుమార్తెకు రెండు రోజుల కిందట వేరే సామాజిక వర్గానికి చెందిన యువకుడితో పెళ్లి నిశ్చయమైంది. దీంతో ఆయన సమాజానికి వర్గమైన బొత్ర సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆదివారం దమనాగూడలోని దంతేశ్వరి ఆలయంలో అఖిల భారతీయ బొత్ర పరిషత్‌ సమావేశమైంది. జిల్లా అధ్యక్షుడు జగన్నాథ్‌ మాఝి నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో కుటుంబాన్ని తమ సంఘం నుంచి బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకున్నారు. మాజీ ఎమ్మెల్యే కులం కట్టబాట్లను, ఆచారాలను ధిక్కరించారని వారు ఆరోపించారు. ప్రధాన్ ప్రముఖ రాజకీయ నేత కావడం, అతడి బహిష్కరణ కొన్ని ప్రాంతాలలో సాంప్రదాయ సామాజిక కట్టుబాట్ల ప్రభావం ఇంకా కొనసాగుతోందన్న విషయాన్ని స్పష్టం చేస్తుండటంతో ఈ పరిణామం తీవ్ర చర్చకు దారితీసింది.ఇదిలా ఉండగా తమ కుల సంఘం నిర్ణయంపై సదాశివ ప్రధాన్‌ స్పందించారు. ఆయన మాట్లాడుతూ ‘‘ఉన్నత విద్యా వంతులైన పిల్లలు ఒకే సంస్థలో పనిచేస్తున్నారు. ఒకరినొకరు ఇష్టపడి పెద్దల అనుమతితో పెళ్లి చేసుకుంటున్నారు. వారి అభిప్రాయాలను గౌరవించి వివాహానికి అనుమతించాను.. ఇందుకు తనను కులం నుంచి వెలేస్తామంటే నేను ఏమీ చేయలేను. గతంలోనూ ఇలాంటి కారణాలతోనే మాజీ ఎంపీ ప్రదీప్ మాఝి, మాజీ ఎమ్మెల్యేలు సదన్‌ నాయక్‌, మనోహర్‌ రంధారి, జెడ్పీ ఛైర్మన్ మంజుల మాఝి కుటుంబాలను బహిష్కరించారు... కొద్ది రోజుల తర్వాత మళ్లీ తిరిగి చేర్చుకున్నారు’’ అని తెలిపారు. కాగా, జయపూర్‌కు చెందిన బ్రాహ్మణ యువకుడితో మాజీ ఎమ్మెల్యే కుమార్తె వివాహం వచ్చే నెలలో జరగనుందని తెలుస్తోంది. తరతరాలుగా వస్తున్న గిరిజన సంప్రదాయాలు, ఆచారాలకు విరుద్ధంగా ఆయన వ్యవహరించారని కులపెద్దలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతేడాది మార్చిలోనూ నవరంగ్‌పూర్ ఎంపీ ప్రదీప్ మాఝి కూడా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నారు. గిరిజనుడైన ఆయన.. వేరే కులానికి చెందిన యువతిని గోవాలో వివాహం చేసుకోవడంతో ఆయన కుటుంబాన్ని 12 ఏళ్ల పాటు బహిష్కరిస్తూ బొత్రా కమ్యూనిటీ నిర్ణయం తీసుకుంది. ఈ అంశం అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.