ఐపీఎల్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన ఫ్రాంచైజీలలో ఒకటైన (ఆర్సీబీ) అమ్మకం ఇప్పుడు తుదిదశకు చేరుకుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 ఛాంపియన్‌గా నిలిచిన ఈ జట్టును కొనుగోలు చేసేందుకు భారీ స్థాయిలో బిడ్లు వస్తుండగా, ప్రస్తుతం ఇద్దరు ప్రధాన కంటెండర్లు మాత్రమే ఫైనల్ రేస్‌లో ఉన్నట్లు సమాచారం.నివేదికల ప్రకారం, స్వీడన్‌కు చెందిన ప్రైవేట్ ఈక్విటీ సంస్థ గణనీయమైన బిడ్‌ను సమర్పించింది. మరోవైపు, రంజన్ పై నేతృత్వంలో కేకేఆర్ (యూఎస్ ప్రైవేట్ ఈక్విటీ ఫర్మ్), సింగపూర్‌కు చెందిన టెమాసెక్ భాగస్వామ్యంతో కూడిన కన్సార్టియం కూడా బలమైన పోటీ ఇస్తోంది. మొత్తం డీల్ విలువ సుమారు 2 బిలియన్ డాలర్ల వరకు వెళ్లే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.ఇప్పటికే గ్లేజర్ ఫ్యామిలీ నుంచి 1.8 బిలియన్ డాలర్ల నాన్-బైండింగ్ ఆఫర్ వచ్చినప్పటికీ, వారు చివరకు రేస్ నుంచి తప్పుకున్నారు. అలాగే ఆదార్ పూనావాలా కూడా ఈ డీల్‌లో నుంచి వెనక్కి తగ్గినట్లు సమాచారం. ఇప్పటివరకు వచ్చిన బిడ్లను దృష్టిలో ఉంచుకుంటే, ఇది సూటిగా బిడ్డింగ్ వార్‌గా మారే అవకాశముందని తెలుస్తోంది. ఈ అమ్మక ప్రక్రియను నిర్వహిస్తున్న డయాగో గ్రూప్ మార్చి 31ను డెడ్‌లైన్‌గా నిర్ణయించింది. ఇదిలా ఉంటే, మరో ఐపీఎల్ జట్టు రాజస్థాన్ రాయల్స్ అమ్మకంపై కూడా ఆసక్తి పెరుగుతోంది. ఈ ఫ్రాంచైజీకి ఇప్పటికే మూడు బైండింగ్ బిడ్లు వచ్చినట్లు సమాచారం. ఇందులో ఆదిత్య బిర్లా గ్రూప్ ముందంజలో ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. మొదట మెజారిటీ వాటాను మాత్రమే అమ్మాలని భావించిన రాజస్థాన్ యాజమాన్యం, ఇప్పుడు పూర్తిగా విక్రయానికి కూడా సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. బిడ్ల విలువ 1.1 బిలియన్ నుంచి 1.35 బిలియన్ డాలర్ల మధ్య ఉందని అంచనా.ఈ డీల్‌ను రయాన్ గ్రూప్ పర్యవేక్షిస్తోంది. ఇదే సంస్థ గతంలో ది హండ్రెడ్ లీగ్ ఫ్రాంచైజీల అమ్మకాన్ని కూడా నిర్వహించింది. అలాగే ఆదిత్య బిర్లా గ్రూప్, అమెరికాకు చెందిన బిజినెస్ మ్యాన్ డేవిడ్ బ్లిట్జర్ కలిసి కన్సార్టియంగా బిడ్ సమర్పించినట్లు సమాచారం. ఈ డీల్‌కు కూడా మార్చి 31నే డెడ్‌లైన్‌గా నిర్ణయించినట్లు తెలుస్తోంది. మొత్తంగా చూస్తే, ఐపీఎల్ ఫ్రాంచైజీల విలువలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో, ఆర్‌సీబీ అమ్మకం క్రికెట్ చరిత్రలోనే అతిపెద్ద డీల్స్‌లో ఒకటిగా నిలిచే అవకాశం కనిపిస్తోంది.