ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ లెక్చరర్ ఇంటర్ విద్యార్థులకు అద్భుతమైన అవకాశం కల్పించారు. కేవలం రూపాయితో ఆన్‌లైన్‌లో పోటీ పరీక్ష రాసే అవకాశం కల్పించారు. అన్నమయ్య జిల్లా నిమ్మనపల్లె మండలం మంచుగుంటపల్లెకు చెందిన రెళ్లా రెడ్డప్ప లెక్చరర్‌గా పనిచేస్తున్నారు. ఆయన పేరుతో ఒక వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. అయితే ఇంటర్ విద్యార్థులు ఈ వెబ్‌సైట్‌ ద్వారా కేవలం రూపాయి చెల్లించి పరీక్ష రాయొచ్చు. విద్యార్థులు తమ ప్రతిభను పరీక్షించుకోవడానికి ఎవరికివారు ఈ పరీక్ష రాసుకోవచ్చని రెడ్డప్ప చెబుతున్నారు. ఈ పరీక్షకు అవసరమైన ప్రశ్నల్ని అందుబాటులో ఉంచారు. 24/7 విద్యార్థులు ఎక్కడి నుంచైనా, ఎప్పుడైనా ల్యాప్‌ ట్యాప్, మొబైల్, ట్యాబ్‌ ద్వారా పరీక్షలు రాయొచ్చు.. ఆ పరీక్ష ఫలితాన్ని వెంటనే తెలుసుకోవచ్చు.రెడ్డప్ప ఇంటర్‌ విద్యార్థులు పోటీ పరీక్షలలో తమ నైపుణ్యాన్ని తెలుసుకునేలా ఈ ప్లాన్ చేశారు. జాతీయ స్థాయి పోటీ పరీక్షల్ని ఆన్‌లైన్‌లో కేవలం రూపాయి ఫీజుతో నిర్వహిస్తున్నారు. ఇంటర్ విద్యార్థులు ఈ పరీక్షలు రాసి తమ ప్రతిభకు సాన పెట్టుకోవచ్చంటున్నారు. రెడ్డప్ప ప్రధానంగా జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్‌డ్, నీట్‌ పరీక్షలు రాసే అవకాశాన్ని కల్పించారు. విద్యార్థుల్లో వారిలో నైపుణ్యాలను, ప్రతిభను వెలికితీసి ఆత్మస్థైర్యాన్ని నింపడం కోసమే ఈ ప్రయత్నం అంటున్నారు రెడ్డప్ప. ఇంటర్ విద్యార్థులు ఈ అద్భుతమైన అవకాశాన్ని ఉపయోగించుకోవాలని సూచిస్తున్నారు.