AP Weather: ఏపీలో భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్

Wait 5 sec.

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక. వచ్చే రెండు గంటల్లో ఏపీలోని పలు జిల్లాలలో పిడుగులతో కూడిన కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఈ మేరకు శనివారం (మార్చి 21) సాయంత్రం ఐదు గంటలకు ప్రకటన విడుదల చేసింది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని.. గంటకు 50 కిలోమీటర్ల నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. అనకాపల్లి, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, కృష్ణా జిల్లా, ఏలూరు, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాలకు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఈ మేరకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. అల్లూరి సీతారామరాజు, పోలవరం, కాకినాడ, మార్కాపురం, ప్రకాశం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది. ఇక విశాఖ, అనకాపల్లి, నెల్లూరు, వైఎస్ఆర్ కడప జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉరుములు, మెరుపులు వచ్చిన సమయంలో సురక్షితమైన భవనాల్లో తలదాచుకోవాలని సూచించింది. పిడుగులు పడే అవకాశం ఉన్నందున చెట్ల కింద, బహిరంగ ప్రదేశాల్లో నిలబడరాదని సూచించింది. అలాగే ఇంట్లోని ఎలక్ట్రానిక్ వస్తువులను వాడటం తగ్గించాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సూచనలు చేసింది. రైతులు, కాపరులు పొలాల్లో ఉండవద్దని.. వర్షం పడేటప్పుడు చెట్ల కింద, విద్యుత్ స్తంభాల సమీపంలో ఉండవద్దని సూచించింది. ప్రత్తిపాడులో ఈదురుగాలులు.. మరోవైపు గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో భారీ ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. ఈ ఈదురుగాలుల ధాటికి పలుచోట్ల చెట్లు నేలకూలాయి. ఫలితంగా రాకపోకలకు ఆటంకం కలిగి.. వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. సమాచారం అందుకున్న మున్సిపల్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. విద్యుత్ తీగలపై చెట్ల కొమ్మలు విరిగిపడటంతో.. ముందు జాగ్రత్తగా ఆయా ప్రాంతంలో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. రంపాల సాయంతో చెట్లను తొలగించి, వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు. అయితే ఈ ఘటనల్లో ఎవరికీ ఎలాంటి అపాయం కలగకపోవటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు అకాల వర్షాల కారణంగా పలు జిల్లాలలో పంటలు దెబ్బతిన్నాయి. దీంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.