యుద్ధం జరుగుతున్నా 'బంగారం' పతనం ఎందుకు? మార్చిలోనే రూ. 25 వేలు డౌన్.. కారణాలివే.. ఇంకా తగ్గుతుందా?

Wait 5 sec.

: ఏ ఆపద వచ్చినా సురక్షిత పెట్టుబడి సాధనంగా భావించే బంగారం ఇక సురక్షితం కాదా? ధర ఇంకా తగ్గుతుందా? ఇదే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవును మరి.. సాధారణంగా అంతర్జాతీయంగా అనిశ్చితి ఉన్నా.. ఆర్థిక సంక్షోభం నెలకొన్నా.. రాజకీయ- భౌగోళిక ఉద్రిక్తతలు నెలకొన్నా.. బంగారం ఆకర్షణీయంగా మారి పెట్టుబడులు పెరుగుతుంటాయి. అనిశ్చితి వేళ.. ఇది ఆదుకుంటుందని నమ్ముతుంటారు. కానీ ఇప్పుడు అంతర్జాతీయంగా తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య తీవ్ర యుద్ధం నడుస్తోంది. మధ్యలో అమెరికా కూడా ఇరాన్‌పై దాడులు చేస్తోంది. ఇరాన్ ఈ దేశాలతో పాటుగా.. సమీపంలోని గల్ఫ్ దేశాలపైనా అటాక్ చేస్తోంది. చమురు సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. క్రూడాయిల్ ధరలు పెరుగుతున్నాయి. . ఈ పరిస్థితే అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. బంగారంపైకి పెట్టుబడుల్ని మళ్లించాల్సిన సమయంలో.. వెనక్కి తీసుకొస్తున్నారు. దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఒక్కసారి ధరల్ని పరిశీలిస్తే.. యుద్ధం ఫిబ్రవరి 28న ప్రారంభం కాగా.. ఆ రోజుతో పాటు మార్చి 1న గోల్డ్ రేటు పెరగ్గా.. అదే రోజు ఈ నెలలో గరిష్ఠ ధరను నమోదు చేసింది. మార్చి 1న 24 క్యారెట్ల పసిడి ధర 10 గ్రాములకు సరిగ్గా రూ. 1,73,090 వద్ద ఉంది. ఇప్పుడు చూస్తే 24 క్యారెట్ల గోల్డ్ రేటు హైదరాబాద్ నగరంలో రూ. 1,45,970 వద్ద ఉంది. ఈ క్రమంలో 20 రోజుల్లో ఏకంగా రూ. 27,120 తగ్గింది. ఇక 22 క్యారెట్ల పసిడి ధర చూస్తే మార్చి 1న తులం రూ. 1,58,650 వద్ద ఉండగా.. మార్చి 21న అది రూ. 1,33,800 వద్ద ఉంది. ఇది రూ. 24,850 తగ్గుముఖం పట్టింది. దీంతో కొనుగోలు దారులు పండగ చేసుకుంటున్నారు. పెట్టుబడిదారుల ముఖచిత్రం వేరేలా ఉంది. ఇంటర్నేషనల్ మార్కెట్లో చూస్తే యుద్ధం ప్రారంభం సమయంలో స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు ఒక దశలో ఏకంగా 5400 డాలర్ల మార్కు వద్ద గరిష్ఠాల్ని నమోదు చేయగా.. ఇప్పుడు ఇది 4500 డాలర్ల మార్కు దిగువకు చేరింది. మరో షాకింగ్ విషయం.. ఈ వారంలో బంగారం ధర 10 శాతం వరకు పడిపోయింది. గత 14 ఏళ్లలో వారంలో ఇంత శాతం పతనం అవడం ఇదే తొలిసారి. సిల్వర్ రేటు కూడా 90 డాలర్లపైన ఉండేది కాస్తా 67 డాలర్లకు పడిపోయింది. ధరలు ఎందుకు తగ్గుతున్నాయి..?ప్రస్తుత సంక్షోభ సమయాల్లో సాధారణంగా బంగారం ధర పెరగకుండా తగ్గేందుకు పలు కారణాలు ఉన్నాయి. వీటిని చూస్తే ప్రధానంగా..యూఎస్ డాలర్ బలపడటం. అవును.. ప్రస్తుత సమయంలో ఇన్వెస్టర్లు బంగారం కాకుండా డాలర్‌వైపు పెట్టుబడులు పెడుతున్నారు. డాలర్ పెరిగితే ఇతర కరెన్సీల్లో బంగారం కొనడం ఖరీదుగా మారుతుంది. దీంతో బంగారానికి డిమాండ్ తగ్గుతోంది.ఇటీవల యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గించకుండా స్థిరంగా ఉంచడం. ఇది కూడా బంగారం డిమాండ్‌ను తగ్గిస్తుంది. యుద్ధం నేపథ్యంలో ద్రవ్యోల్బణం పెరుగుతుందన్న భయాలతో.. యూఎస్ ఫెడ్ సమీప భవిష్యత్తులో వడ్డీ రేట్లను పెంచే అవకాశాలున్నట్లు సంకేతాలు వస్తున్నాయి. ఫెడ్ వడ్డీ రేట్లను పెంచితే.. బంగారం ధర ఇంకా తగ్గుతుంది.మార్కెట్లో అస్థిరత నెలకొంటే అప్పుడు పెట్టుబడిదారులు బంగారం అమ్మేసి క్యాష్ తీసుకుంటుంటారు. అంటే లాభాల్ని అందిపుచ్చుకునేందుకు, నష్టాల్ని తగ్గించుకునేందుకు బంగారాన్ని విక్రయిస్తుంటారు. ఇది డిమాండ్‌ను తగ్గించి.. ధరలు తగ్గేలా చేస్తుంది.యుద్ధం ముందు వరకు భారీగా పెరగ్గా.. అనిశ్చిత పరిస్థితుల్లో ప్రాఫిట్ బుకింగ్‌ కూడా బంగారం ధరలు తగ్గేందుకు కారణంగా నిలుస్తోంది.ఈ యుద్ధంలో ముఖ్యమైన అంశంగా ఆయిల్ మారింది. సరఫరాల్లో అంతరాయం కారణంగా ధరలు పెరుగుతున్నాయి. దీంతో పెట్టుబడుల్ని ఆయిల్ మార్కెట్‌వైపు మళ్లిస్తున్నారు.ముందుగానే గోల్డ్ మార్కెట్ యుద్ధాన్ని అంచనా వేయడంతో.. గోల్డ్ ర్యాలీ కనిపించట్లేదు.ధరలు ఇంకా తగ్గుతాయా?సింపుల్‌గా చెప్పాలంటే.. ఇక్కడ యూఎస్ డాలర్.. ఫెడ్ వడ్డీ రేట్లు.. ఇన్వెస్టర్ల ధోరణి.. ఇవే బంగారం ధరల్ని నిర్దేశిస్తున్నాయి. యుద్ధం మరింత తీవ్రం అయితే బంగారం ధరలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. కానీ డాలర్ ఇలానే బలంగా ఉండి ఉంటే.. ఇంకా ఫెడ్ వడ్డీ రేట్లను పెంచితే గనుక బంగారంపై ఒత్తిడి పడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. క్రూడాయిల్ ధర పెరిగితే ద్రవ్యోల్బణం పెరిగితే గనుక.. ఫెడ్ వడ్డీ రేట్లు ఇప్పట్లో తగ్గించకపోవచ్చనే తెలుస్తోంది.