ఇరాన్, ఇజ్రాయెల్- అమెరికా యుద్ధం కారణంగా పశ్చిమాసియా నుంచి ఇంధన సరఫరా నిలిచిపోయింది. ఈ యుద్దం ప్రపంచ దేశాలను ప్రభావితం చేస్తోంది. ఇక, వాణిజ్య గ్యాస్ సిలిండర్లపై పరిమితులు విధించిన కేంద్ర ప్రభుత్వం.. గృహావసరాలకు ప్రాధాన్యత ఇస్తోంది. దీంతో హోటల్, ఆతిథ్య రంగం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో గ్యాస్ సమస్యను పరిష్కరించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రాలకు 20 శాతం గ్యాస్ వాటాను అదనంగా కేటాయిస్తున్నట్టు ప్రకటించింది. మార్చి 23 నుంచి ఇది అమల్లోకి రానుందని ఈ మేరకు కేంద్ర పెట్రోలియం సహజవాయువు శాఖ కార్యదర్శి డాక్టర్ నీరజ్ మిట్టల్ అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు లేఖ రాశారు. లేఖలో గ్యాస్ కేటాయింపులపై స్పష్టత నిచ్చారు. తాజా పెంపుతో రాష్ట్రాలకు అందే, ఇది సామాన్య ప్రజానీకం, వివిధ రంగాలకు ఊరటనిస్తుందని లేఖలో నీరజ్ మిట్టల్ పేర్కొన్నారు. కానీ, అదనంగా కేటాయించిన 20 శాతం గ్యాస్‌ను వినియోగంలో కొన్ని ఖచ్చితమైన ప్రాధాన్యతలను కేంద్రం స్పష్టం చేసింది. ముఖ్యంగా సామాన్యుల ఆహార అవసరాలకు లోటు లేకుండా ఉండేలా హోటళ్లు, రెస్టారెంట్లు, దాబాలు, ఇండస్ట్రియల్ క్యాంటీన్లు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించింది. అలాగే, ప్రభుత్వాలు లేదా స్థానిక సంస్థలు రాయితీతో నిర్వహించే క్యాంటీన్లు, కమ్యూనిటీ కిచెన్లు, వలస కార్మికులకు ఉద్దేశించిన 5 కిలోల ఎఫ్‌టిఎల్ సిలిండర్లను కచ్చితంగా సరఫరా చేయాలని పెట్రోలియం శాఖ కార్యదర్శి మిట్టల్ తన లేఖలో స్పష్టంగా తెలిపారు. ఈ అదనపు కోటా దుర్వినియోగం కాకుండా చూడాల్సిన బాధ్యత స్థానిక ప్రభుత్వాలదేనని తేల్చిచెప్పింది. బ్లాక్ మార్కెట్‌ సహా పక్కదారి పట్టకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని, అర్హులైనవారికి మాత్రమే ఇది అందేలా చూడాలని సూచించింది. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఈ కేటాయింపులు అమలులో ఉంటాయని పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా సరఫరా వ్యవస్థలు మెరుగు పడే వరకు ఈ ప్రాధాన్యత క్రమాన్ని పాటించాలని ఆదేశించింది. తాజా నిర్ణయంతో ముఖ్యంగా వలస కార్మికులు, మధ్యతరగతి ప్రజలకు కొంత మేర ఉపశమనం లభించే అవకాశం ఉంది. గ్యాస్ కొరతతో పరిశ్రమలు, ఐటీ కంపెనీల్లో క్యాంటీన్లు మూసివేయగా.. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో హోటల్స్, రెస్టారెంట్‌లలో మెనూలు తగ్గించేశాయి. ఇక, ఇదే అదునుగా పలువురు దోపిడీకి తెరతీశారు. అనేక హోటల్స్, కేఫ్‌లు.. వినియోగదారుల నుంచి గ్యాస్ ఛార్జీలను అదనంగా వసూలు చేస్తున్నాయి.