ఏపీ పర్యాటక రంగానికి బూస్ట్ ఇస్తూ... అంతర్జాతీయ స్థాయిలో పర్యాటక రంగాన్ని తీర్చిదిద్దే లక్ష్యంతో విశాఖ నగరం నడిబొడ్డున ప్రతిష్టాత్మక 'హయత్' ఫైవ్ స్టార్ హోటల్ నిర్మాణానికి అంకురార్పణ జరిగింది. విశాఖపట్నంలోని సాగర్ నగర్–ఎండాడ సమీపంలో ప్రతిష్టాత్మక హయత్ ఫైవ్ స్టార్ హోటల్ నిర్మాణానికి పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, స్థానిక గంటా శ్రీనివాసరావు భూమి పూజ నిర్వహించారు. రూ.250 కోట్ల భారీ పెట్టుబడితో 3 ఎకరాల విస్తీర్ణంలో నిర్మితమవుతున్న ఈ హోటల్.. అంతర్జాతీయ ప్రమాణాలతో రూపుదిద్దుకుని వచ్చే రెండేళ్లలో అందుబాటులోకి రానుందని మంత్రి దుర్గేష్ వెల్లడించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి నాయకత్వంలో జరిగిన సీఐఐ సమ్మిట్ ఫలితంగా కుదిరిన పెట్టుబడులు నేడు కార్యరూపం దాల్చడం రాష్ట్ర అభివృద్ధికి నిదర్శనమని అన్నారు. విశాఖపట్నం వేగంగా ‘గ్లోబల్ సిటీ’గా ఎదుగుతున్న ప్రస్తుత తరుణంలో, హయత్ వంటి అంతర్జాతీయ హోటల్ రాకతో పర్యాటక రంగానికి మరింత ఊతం చేరుతుందని సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ప్రపంచ స్థాయి వసతులు, ఆధునిక కాన్ఫరెన్స్ హాళ్లు, ఫైన్ డైనింగ్ సదుపాయాలతో జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించడంలో ఇది కీలక పాత్ర పోషించనుందని చెప్పారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా స్థానిక యువతకు భారీగా ఉపాధి అవకాశాలు కలుగుతాయని.. అలాగే విశాఖ నగర అభివృద్ధిలో ఇది ఒక మైలురాయిగా నిలుస్తుందని నమ్ముతున్నానని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో విశాఖ కలెక్టర్ హరీంద్ర ప్రసాద్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.ఇక ప్రభుత్వం పలు భారీ హోటల్ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా విశాఖపట్నం బీచ్ రోడ్డులోని తాజ్ గేట్‌వేను వరుణ్ హాస్పిటాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ రూ.899 కోట్ల భారీ పెట్టుబడితో 5-స్టార్ డీలక్స్ హోటల్‌గా, సర్వీస్ అపార్ట్‌మెంట్స్‌గా అభివృద్ధి చేయనుంది, దీని ద్వారా సుమారు 1,300 మందికి ఉపాధి లభించనున్నట్లు అధికారులు తెలిపారు. అదేవిధంగా తిరుపతిలో స్రవంతి హోటల్స్ అండ్ రిసార్ట్స్ సంస్థ రూ.327 కోట్ల వ్యయంతో ఐబీఐఎస్ స్టైల్స్ 3-స్టార్, నోవోటెల్ 5-స్టార్ హోటళ్లను నిర్మించి 570 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనుంది. వీటితో పాటు తిరుపతిలోని వడమాలపేటలో బెంగాల్ అల్టిమేట్ రిసార్ట్స్ సంస్థ రూ.150 కోట్లతో ప్రతిష్టాత్మకమైన 5-స్టార్ రిసార్ట్‌ను ఏర్పాటు చేస్తోంది. ఈ ప్రాజెక్టులన్నింటికీ ప్రభుత్వం భూ కేటాయింపులతో పాటు ప్రత్యేక ప్రోత్సాహకాలను అందిస్తూ పర్యాటక మౌలిక సదుపాయాల విస్తరణకు ప్రాధాన్యతనిస్తోంది.