ఎండాకాలంలో వానలు.. బుధవారం రోజు ఈ జిల్లాల్లో పిడుగులతో వర్షం

Wait 5 sec.

ఆంధ్రప్రదేశ్‌లో భిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. కొన్ని ప్రాంతాలలో భానుడి భగభగలు కొనసాగుతుంటే.. మరికొన్ని చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం రోజు ఏపీలోని పలు జిల్లాలలో వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. అల్లూరి సీతారామరాజు జిల్లా, పోలవరం జిల్లా, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా , వైఎస్సార్ కడప, అన్నమయ్య జిల్లా, చిత్తూరు, తిరుపతి జిల్లాలలోని పలు ప్రాంతాలలో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు. మిగిలిన జిల్లాలలోనూ తేలికపాటి వానలు కురిసేందుకు అవకాశం ఉందని అంచనా వేశారు. పిడుగులు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండాలని.. చెట్ల కింద నిలబడవద్దని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.మరోవైపు కొన్ని జిల్లాలలో వానలు పడుతుంటే మరికొన్ని జిల్లాలలో మాత్రం ఎండలు దంచికొడుతున్నా్యి. కోస్తా జిల్లాలలో కాస్త శాంతించిన సూర్యుడు.. రాయలసీమ జిల్లాలలో మాత్రం మండిపోతున్నాడు. సోమవారం రోజున అనంతపురంలో అత్యధికంగా38.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మరో మూడు, నాలుగు రోజులు వాతావరణంలో ఇదే తరహా అనిశ్చితి కొనసాగుతుందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల తేలికపాటి వానల నుంచి మోస్తరు వర్షం కురిసేందుకు అవకాశాలు ఉన్నాయని అమరావతి వాతావరణ కేంద్రం అంచనా వేసింది. పిడుగులతో పాటుగా ఈదురుగాలులు వీచేందుకు అవకాశం ఉందని తెలిపింది. వాతావరణ అనిశ్చితుల నేపథ్యంలో వచ్చే నాలుగురోజులు కోస్తా జిల్లాలలో ఉష్ణోగ్రతలు రెండు, మూడు డిగ్రీలు తగ్గుతాయని వెల్లడించింది. మరోవైపు ద్రోణి, నైరుతి దిశ నుంచి వీస్తున్న గాలులతోనే ఇలాంటి భిన్నమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. వర్షాలు కురిసే జిల్లాలలో పిడుగులు పడేందుకు అవకాశాలు ఉన్నాయని.. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. బహిరంగ ప్రదేశాలలో, చెట్ల కింద, విద్యుత్ స్తంభాల సమీపంలో నిలబడవద్దని సూచించారు. ఇక ఎండలు ఎక్కువగా ఉన్న జిల్లాలలో శరీరం డీహైడ్రేషన్‌కు గురికాకుండా చూసుకోవాలని.. ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలని సూచిస్తున్నారు.