రాష్ట్రంలో పెట్టుబడి సాయం కోసం ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న రైతులకు భారీ శుభవార్త అందింది. నిధులను తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రిలీజ్ చేశారు. మొత్తం 3 విడతల్లో రైతు భరోసా నిధులను విడుదల చేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. తొలి విడతలో భాగంగా రూ.3590 కోట్లను.. ఎకరం భూమి ఉన్న రైతుల ఖాతాల్లో జమ కానుంది. ఆదివారం రోజున బ్యాంకులకు సెలవు కావడంతో సోమవారం రోజున రైతుల అకౌంట్లలో డబ్బులు పడనున్నాయి. ఈ రైతు భరోసా పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1.50 కోట్ల ఎకరాలకు రూ.9 వేల కోట్లను రేవంత్ రెడ్డి సర్కార్ అందించనుంది. సిద్దిపేట జిల్లా నంగునూర్ మండలం నర్మెట గ్రామంలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం తర్వాత నిర్వహించిన సభలో సీఎం రేవంత్ రెడ్డి రైతు భరోసా నిధులను రిలీజ్ చేశారు. తొలి విడతలో భాగంగా రూ.3,590 కోట్లను విడుదల చేసినట్లు రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో మొత్తం 73 లక్షల మంది రైతులు ఉన్నారని.. వారిలో ఒక ఎకరం వరకు సాయం అందేలా రూ.3,590 కోట్లను విడుదల చేశారు. ఇక 20 రోజుల తర్వాత రెండో విడత రైతు భరోసా నిధుల్లో భాగంగా మరో రూ.2,650 కోట్లు.. ఆ తర్వాత 25 రోజులకు మూడో విడతలో మిగిలిన రూ.2,760 కోట్ల నిధులను విడుదల చేయనున్నట్లు ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో ఉన్న మొత్తం 24.32 లక్షల మంది రైతులకు ఎకరం వరకు.. 48.68 లక్షల మందికి ఎకరం కంటే ఎక్కువ భూములు ఉన్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు తేల్చారు. రైతులకు పెట్టుబడి సాయం కోసం.. రైతు భరోసా పథకం కింద తెలంగాణ ప్రభుత్వం ప్రతి సంవత్సరం 2 విడతల్లో ఎకరాకు రూ.6 వేల చొప్పున.. సంవత్సరానికి రూ. 12 వేల చొప్పున రైతులకు సాయం అందిస్తోంది. రేవంత్ రెడ్డి సర్కార్ ఎన్నికల హామీ సందర్భంగా ఈ రైతు భరోసా పథకం కింద ఏటా రూ.15 వేలు ఇస్తామని చెప్పినప్పటికీ.. ఇంకా పెంచలేదు.