తిరుమల శ్రీవారికి భారీ విరాళం.. చెన్నై సంస్థ కళ్లు చెదిరే మొత్తం..

Wait 5 sec.

తిరుపతి దేవస్థానానికి మరోసారి భారీ విరాళం అందింది. చెన్నైకు చెందిన సుబ్బరావ్ అపారల్స్ అనే సంస్థ టీటీడీకి కోటి రూపాయలు విరాళంగా అందించింది. టీటీడీ ఆధ్వర్యంలో నడిచే శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకానికి రూ. కోటి విరాళంగా అందించారు. ఆదివారం రోజు దాత రాజా రమేష్ టీటీడీ ఏఈవో సీహెచ్ వెంకయ్య చౌదరికి విరాళానికి సంబంధించిన చెక్కును అందించారు. ఈ సందర్భంగా దాతను టీటీడీ ఏఈవో వెంకయ్య చౌదరి అభినందించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి సైతం హాజరయ్యారు. శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకాన్ని స్విమ్స్ ఆస్పత్రిలో టీటీడీ నిర్వహిస్తోంది. ఈ పథకం ద్వారా నిరుపేదలు, అర్హులైన రోగులకు కార్పొరేట్ వైద్యం అందిస్తారు. ఈ క్రమంలోనే పలువురు దాతలు బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకానికి తమవంతు విరాళాలు అందించి సామాజిక సేవ చేస్తుంటారు. ఈ క్రమంలోనే చెన్నై సంస్థ కోటి రూపాయలు విరాళంగా అందించింది. తిరుమల శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలుతిరుమలలో మార్చి 30వ తేదీ నుంచి ఏప్రిల్ 01 తేదీ వరకు శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు ఘనంగా జరుగనున్నాయి. ఏటా చైత్రశుద్ధ పౌర్ణమి సందర్భంగా సాలకట్ల వసంతోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఈ క్రమంలోనే మార్చి 30వ తేదీ నుంచి మూడు రోజులపాటు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. మార్చి 30వ తేదీ ఉదయం ఆరున్నర గంటలకు స్వామివారు నాలుగు మాడవీధులలో ఊరేగుతారు. ఆ తర్వాత వసంతోత్సవ మండపానికి వేంచేస్తారు. వసంతోత్సవ అభిషేక నివేదనలు పూర్తైన తర్వాత తిరిగి ఆలయానికి చేరుకుంటారు. మార్చి 31వ తేదీ ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు బంగారు రథాన్ని అధిరోహించి స్వామివారు మాడ వీధులలో ఊరేగుతారు. ఆ తర్వాత వసంత మండపంలో వసంతోత్సవాన్ని నిర్వహిస్తారు. చివరిరోజైన ఏప్రిల్ ఒకటో తేదీ మలయప్పస్వామితో పాటుగా శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయస్వామి ఉత్సవర్లు, రుక్మిణి సమేత శ్రీకృష్ణస్వామి ఉత్సవమూర్తులు వసంతోత్సవంలో పాల్గొంటారు. వసంతోత్సవాల నేపథ్యంలో ఈ మూడు రోజులు మధ్యాహ్నం 2 నుండి 4 గంటల వరకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. సాయంత్రం 6 నుండి 6.30 గంటల వరకు ఆస్థానం నిర్వహిస్తారు. వసంతోత్సవం సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో మూడురోజుల పాటు కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్‌సేవ, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది. మార్చి 31న అష్టదళ పాద పద్మారాధన సేవ రద్దు చేసినట్లు టీటీడీ తెలిపింది.