విస్తరిస్తోన్న యుద్ధం.. హిందూ మహాసముద్రంలోని అమెరికా-బ్రిటన్ స్థావరంపై ఇరాన్ క్షిపణి దాడులు

Wait 5 sec.

ఇజ్రాయెల్- అమెరికా, ఇరాన్ మధ్య మూడు వారాలుగా జరుగుతోన్న యుద్ధం భౌగోళిక పరిధి దాటుతుందనే సంకేతాలు టెహ్రాన్ పంపింది. తాజాగా, హిందూ మహాసముద్రంలో జరిగిన రెండు దాడులే ఇందుకు ఉదాహరణ. హిందూ మహాసముద్రంలోని చాగోస్ దీవుల్లోని డియెగో గార్సియాలో అమెరికా-బ్రిటన్ స్థావరంపై ఇరాన్ రెండు బాలిస్టిక్ క్షిపణులతో దాడిచేసినట్టు అమెరికా అధికారులను ఉటంకిస్తూ వాల్‌స్ట్రీట్ జర్నల్ నివేదించింది. అయితే, రెండు క్షిపణులలో ఏదీ లక్ష్యాన్ని ఛేదించలేదని పేర్కొంది. ఒకటి మార్గమధ్యంలోనే విఫలం కాగా... రెండో దానిని అమెరికా యుద్ధనౌక ఒక ఇంటర్‌సెప్టర్‌తో అడ్డగించింది. అయితే అది దెబ్బతిందా? లేదా? అనేది ఇంకా స్పష్టంగా లేదు.ఈ స్థావరం ఇరాన్ భూభాగం నుంచి సుమారు 4,000 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇంత దూరంలోని లక్ష్యాన్ని చేరుకోగలమని గతంలో ఇరాన్ భావించిన దానికంటే ఇది గణనీయమైన ముందడుగును సూచిస్తుంది. దీని అర్థం ఐరోపాలోని స్థావరాలను టెహ్రాన్ లక్ష్యంగా చేసుకుంటుందనే సంకేతాలు ఇచ్చింది. కాగా, దీనిపై అమెరికా రక్షణ విభాగం పెంటగాన్ ఇప్పటి వరకూ ఎలాంటి ప్రకటన చేయలేదు.‘మధ్య హిందూ మహాసముద్రంలో లోతట్టు ప్రాంతమైన చాగో ద్వీపంలోని డియోగో గార్సియా స్థావరంపై ఇరాన్ దాడులకు ప్రయత్నించిందనే వార్తలే గనుక నిజమైతే యుద్ధాన్ని మరింత విస్తృతం చేసి, పశ్చిమ దేశాలకు టెహ్రాన్ స్పష్టమైన సందేశాన్ని పంపినట్టే..’ అని మాజీ కేంద్ర మంత్రి మనీష్ తివారీ ఎక్స్ (ట్విట్టర్)లో పోస్ట్ పెట్టారు.దీనికి కొద్ది వారాల ముందు హిందూ మహాసముద్రంలో శ్రీలంక తీరాన ఇరాన్ యుద్ధ నౌక ఐరిస్ డేనాపై అమెరికా జలాంతర్గమి టార్బిడోతో దాడిచేసి ముంచేసింది. ఈ ఘటనలో 150 మంది వరకు ఇరాన్ నావికులు ప్రాణాలు కోల్పోయారు. విశాఖపట్నంలోని జరిగిన మిలాన్ 2026లో పాల్గొనడానికి భారత్‌కు అతిథిగా వచ్చిన ఐరిస్ డేనా.. స్వదేశానికి తిరిగి వెళ్తుండగా ఈ దాడి చోటుచేసుకుంది. ఇదే సమయంలోమరోవైపు, ఇరాన్ నేవీతో పాటు ప్రాథమిక లక్ష్యాలను పూర్తిగా నాశనం చేసినట్టు అమెరికా చెబుతోంది. డిగో గార్సియా స్థావరం అఫ్గనిస్థాన్, ఇరాక్‌లపై అమెరికా బాంబు దాడులకు ఒక సన్నాహక కేంద్రంగా కూడా పనిచేసింది. ఇరాన్‌కు వ్యతిరేకంగా బ్రిటన్ చేపట్టిన రక్షణ కార్యకలాపాల కోసం అమెరికా ప్రస్తుతం ఉపయోగిస్తున్న రెండు బ్రిటిష్ స్థావరాల్లో ఇది ఒకటి.చాగోస్ దీవుల సార్వభౌమాధికారాన్ని మారిషస్‌కు తిరిగి అప్పగించడానికి యునైటెడ్ కింగ్డమ్ ఇటీవల అంగీకరించింది. కానీ ఆ దీవులలో అతిపెద్దదైన డిగో గార్సియాలోని స్థావరం లీజును మాత్రం తన వద్దే ఉంచుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ అప్పగింతను బహిరంగంగా వ్యతిరేకించారు.