ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా నాయుడు ఈ వయసులోనూ ఎంత హుషారుగా, ఎంత చలాకీగా ఉంటారనేదీ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. యువకులతో పోటీపడుతూ పనిచేస్తూ ఉంటారాయన. ఇక ఆహారం విషయంలో ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే తాజాగా తన ఆహారపు అలవాట్లను, ఆరోగ్య రహస్యాన్ని పంచుకున్నారు చంద్రబాబు. ప్రస్తుతం ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సమావేశాల్లో మాట్లాడిన చంద్రబాబు ఎమ్మెల్యేలకు కీలక సూచనలు చేశారు."మీరు తీసుకుంటున్నారో లేదో తెలియదు. నేను రోజూ ఒక పూట తప్పనిసరిగా చేపలు లేదా రొయ్యలు తింటున్నా. ఇది మంచి ఆహారం. మీరూ వాటిని తినాలని కోరుతున్నా. ఒకపూట కంపల్సరీగా చేపలు కానీ, రొయ్యలు వంటి ఆక్వా ఉత్పత్తులు తినగలిగితే ఎక్కువ ప్రొటీన్‌ లభిస్తుంది. చికెన్ కంటే వీటిలోనే ఎక్కువ ప్రొటీన్‌ ఉంటుంది. గతంలో కోడిగుడ్లను ప్రోత్సహించాం. ఇప్పుడు ఆక్వా ఉత్పుత్తులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. దేశం, రాష్ట్రంలో ఆక్వా ఉత్పత్తుల వినియోగం పెంచే విధంగా చర్యలు తీసుకుంటాం. అలాగే వారంలో ఒకరోజు కాలేజీలు, స్కూళ్లల్లో మధ్యాహ్న భోజనంలో అందించేలా చర్యలు తీసుకుంటాం." అని చంద్రబాబు చెప్పుకొచ్చారు.మరోవైపు ప్రతి ఎమ్మెల్యే కూడా వ్యవసాయం మీద ప్రత్యేక దృష్టి పెట్టాలని చంద్రబాబు సూచించారు. ప్రతి ఎమ్మెల్యే కూడా అక్టోబరు నుంచి నెలలో ఒక రోజు పొలాలకు వెళ్లాలని సూచించారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలు వినాలని.. వాటి పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. త్వరలోనే తాను కూడా రైతుల్ని కలుస్తానని చంద్రబాబు చెప్పారు. రైతులను కలిసి వారి కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, పథకాలను వివరించాలని సూచించారు. మరోవైపు భూసార పరీక్షలు చేసి.. ఉచితంగా సూక్ష్మపోషకాలను రైతులకు అందిస్తామని చంద్రబాబు వెల్లడించారు. భూసార పరీక్షల నిర్వహణ ద్వారా రసాయన ఎరువుల వాడకం తగ్గిస్తామన్నారు. మొబైల్‌ రైతుబజార్లను ఏర్పాటు చేస్తామని.. రైతు బజార్లలో సేంద్రీయ వ్యవసాయం స్టాల్స్‌ ఏర్పాటు చేస్తామని చంద్రబాబు నాయుడు వెల్లడించారు.