హైదరాబాద్‌లోని అంబర్‌పేట్ ప్రాంతంలో దశాబ్దాల పోరాటానికి, సామాజిక న్యాయానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన బతుకమ్మ కుంట పూర్వవైభవం సంతరించుకుంది. అత్యంత కీలకమైన పరిణామంలో.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కుంటకు మాజీ ఎంపీ వి. హనుమంతరావు పేరు పెడుతున్నట్లు ప్రకటించారు. నేడు సందర్భంగా సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారు. పోరాట యోధుడికి అరుదైన గౌరవం.. దాదాపు 35 సంవత్సరాల పాటు కబ్జాదారుల నుండి ఈ కుంటను కాపాడటానికి అవిశ్రాంతంగా పోరాటం చేసిన వి. హనుమంతరావు (వీ.హెచ్.)కు దక్కిన గౌరవం ఇది. సుమారు ఐదు ఎకరాల విస్తీర్ణంలో రూ. 7 కోట్ల వ్యయంతో పునరుద్ధరించబడిన ఈ ప్రాంతానికి 'వి. హనుమంతరావు బతుకమ్మ కుంట' అని నామకరణం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఈ ప్రతిపాదనను అమలు చేయడానికి అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కి ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడిగా వీహెచ్ తనకు ఎప్పుడూ మార్గదర్శకులుగా ఉన్నారని.. ఇటీవల ప్రగతి భవన్‌కు జ్యోతిరావు పూలే పేరు పెట్టడంలో కూడా ఆయన సూచనలే కీలకంగా పనిచేశాయని గుర్తు చేసుకున్నారు. 42 శాతం రిజర్వేషన్ల విషయంలో కూడా హనుమంతరావు సలహాలు తమకు ఎంతో విలువైనవని సీఎం తెలిపారు. సుందరీకరణతో జలకళ.. (HYDRA) అధికారులు అద్భుతంగా పునరుద్ధరించారు. రూ. 7 కోట్లతో చేపట్టిన ఈ పునరుద్ధరణ పనుల్లో భాగంగా... చుట్టూ కాంక్రీట్ గోడతో పాటు మెట్లు, పిల్లలు ఆడుకోవడానికి ఆట స్థలం, వృద్ధులు సేద తీరడానికి బెంచీలు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం కుంట నిండుగా నీటితో కళకళలాడుతూ జలకళను సంతరించుకుంది. ఇకపై స్థానిక మహిళలు ప్రతి సంవత్సరం బతుకమ్మ వేడుకలను ఇక్కడే ఘనంగా జరుపుకునేందుకు అవకాశం లభించడంతో, ఈ ప్రాంతం ఒక ముఖ్యమైన సాంస్కృతిక కేంద్రంగా (Cultural Hub) అవతరించనుంది. ఎమ్మెల్యే కీలక ప్రతిపాదన.. అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ ఈ కార్యక్రమం సందర్భంగా మాట్లాడుతూ.. అంబర్‌పేట అభివృద్ధిలో రాజకీయాలు లేకుండా అందరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాజీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ని ఉద్దేశిస్తూ పరోక్ష విమర్శలు చేశారు. కిషన్ రెడ్డి 15 సంవత్సరాలు ఎమ్మెల్యేగా.. 10 సంవత్సరాలు కేంద్ర మంత్రిగా ఉన్నా అంబర్‌పేట అభివృద్ధికి కృషి చేయలేదని విమర్శించారు. అభివృద్ధి కార్యక్రమాలకు రాజకీయాలు అతీతంగా సహకరించాలని కోరారు. అంబర్ పేట ఎమ్మెల్లే కాలేరు వెంకటేష్ ఈ కుంటకు మొదటగా వీహెచ్ పేరు పెట్టాలనే ప్రతిపాదనను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. దీనికి స్పందించిన సీఎం, రాజకీయాలకు అతీతంగా వీహెచ్ సేవలను గౌరవిస్తూ, పేరు మార్పుకు సానుకూలత వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమకారుడుగా, బీసీ నాయకుడుగా వీహెచ్ పోషించిన పాత్రకు ఈ పేరు మార్పు తగిన గౌరవంగా నిలిచింది.