ఏపీలో వారందరికి కొత్తగా పింఛన్‌లు.. ఒక్కొక్కరికి నెలకు రూ.4వేల చొప్పున డబ్బులు ఇస్తారు

Wait 5 sec.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పింఛన్ల పంపిణీకి సిద్ధమైంది. అక్టోబర్ 1వ తేదీన ఎన్టీఆర్‌ భరోసా పథకం కింద 63.50 లక్షల మందికి పింఛన్లు పంపిణీ చేయడానికి ప్రభుత్వం రూ.2,745.50 కోట్లు విడుదల చేసింది. కొత్తగా స్పౌజ్‌ కేటగిరీలో 10,578 మందికి రూ.4 వేల చొప్పున రూ.4.23 కోట్లు మంజూరయ్యాయని మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ తెలిపారు. బుధవారం విజయనగరం జిల్లా దత్తరాజేరు మండలం దత్తి గ్రామంలో జరిగే పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొంటారు. ఇవాళ ఢిల్లీ వెళుతున్నారు.. అక్కడ కార్యక్రమాలను పూర్తి చేసుకుని చంద్రబాబు బుధవారం ఉదయం ఢిల్లీ నుంచి విశాఖపట్నం చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా హెలికాప్టర్‌లో విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గం దత్తికి వెళతారు. అక్కడ చంద్రబాబు స్వయంగా ఎన్టీఆర్‌ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం ‘పేదల సేవలో’ కార్యక్రమంలో కూడా చంద్రబాబు పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 2.40 గంటలకు తెలుగు దేశం పార్టీ కార్యకర్తలతో సమావేశమవుతారు. దత్తి నుంచి హెలికాప్టర్‌లో బయల్దేరి విశాఖపట్నం చేరుకుంటారు.. అక్కడి తిరిగి బయల్దేరి అమరావతి చేరుకుంటారు. ఎన్టీఆర్‌ భరోసా పథకం కింద కొత్త స్పౌజ్‌ పింఛన్లు మంజూరు చేస్తోంది ఏపీ ప్రభుత్వం. గత ప్రభుత్వ హయాంలో చాలా మంది అర్హులు దరఖాస్తు చేసుకోలేకపోయారు. అందుకే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పింఛను తీసుకుంటున్న భర్త చనిపోతే, భార్యకు తదుపరి నెల నుంచే పింఛను వస్తుంది. స్పౌజ్ కేటగిరి కింద నెలకు రూ.4వేలు చొప్పున పింఛన్ మంజూరు చేస్తున్నారు. ఇలా అర్హులు అందరికీ పింఛను అందాలని ప్రభుత్వం భావించింది. ప్రతి నెలా వీరికి గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి పింఛన్లు ఇస్తారు. గతేడాది నవంబరులో ఈ స్పౌజ్‌ పింఛను పథకం మొదలైంది. 2023 డిసెంబరు 1 నుంచి 2024 అక్టోబర్‌ 31 వరకు 89,788 మంది అర్హులు ఉన్నారని ప్రభుత్వం గుర్తించింది. వీరికి పింఛన్లు మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఇలా ప్రతి నెలలో లబ్ధిదారుల్ని గుర్తించి వారికి నెలకు రూ.4వేల చొప్పున స్పౌజ్ కేటగిరి కింద పింఛన్ అందిస్తున్నారు.