తెలంగాణను వర్షాలు వీడటం లేదు. రాష్ట్రంలో ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. తాజాగా హైదరాబాద్ వాతావరణశాఖ రాష్ట్రానికి మరోసారి రెయిన్ అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ కూడా జారీ చేశారు. అండమాన్ సమీపంలో బంగాళాఖాతంలో మంగళవారం (సెప్టెంబరు 30 ) ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని చెప్పారు. ఇది అక్టోబర్ 1 నాటికి ఉత్తర, మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు. వరకు దక్షిణ గుజరాత్, విదర్భ, దక్షిణ ఛత్తీస్‌గఢ్, దక్షిణ ఒడిశా, కోస్తాంధ్ర మీదుగా సగటున సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతోంది. ఈ వాతావరణ పరిస్థితుల ప్రభావంతో తెలంగాణలో మరో నాలుగు రోజులు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. నేడు రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లాల్లోనూ అక్కడక్కడ వర్షాలు పడతాయని చెప్పారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలు నిజామాబాద్, జగిత్యా, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాలతో పాటుగా.. భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం జిల్లాల్లో వానలు కురుస్తాయన్నారు. దక్షిణ/మధ్య తెలంగాణ జిల్లాలు నల్గొండ, సూర్యాపేట, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్‌తోపాటుగా మిగిలిన జిల్లాల్లోనూ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వెల్లడించారు. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. వర్షాలు కురిసే సమయంలో అత్యవసరం అయితే తప్ప ఇళ్ల నుంచి ఎవరూ బయటకు రావొద్దని హెచ్చరిస్తున్నారు. ఇక ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా రాష్ట్రంలోని ప్రాజెక్టులకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టులలో నీటిమట్టాలు గణనీయంగా పెరిగాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.