కుప్పకూలుతున్న టాటా స్టాక్స్.. 9 నెలల్లోనే రూ. 6.6 లక్షల కోట్లు ఆవిరి.. ఇలా అయ్యిందేంటి?

Wait 5 sec.

Tata Stocks: భారత స్టాక్ మార్కెట్లలో కొంత కాలంగా నష్టాలు వస్తున్న సంగతి తెలిసిందే. అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాలు, యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ వసూలు చేస్తున్న దిగుమతి సుంకాలు, ఇతర కఠిన నిర్ణయాలతో మార్కెట్లు పడిపోతున్నాయి. ఇన్వెస్టర్లు తీవ్ర ఒత్తిడికి లోనై షేర్లను అమ్మేస్తున్నారని చెప్పొచ్చు. దేశీయ సూచీలు.. సోమవారంతో కలిపి వరుసగా ఏడో సెషన్‌లో నష్టాల్నే నమోదు చేశాయి. దిగ్గజ హెవీవెయిట్ స్టాక్స్ కూడా పతనం అవుతున్నాయి. ఇందులో ప్రధానంగా మనం టాటా గ్రూప్ గురించి మాట్లాడుకోవాలి. దీని కింద డజనుకుపైగా లిస్టెడ్ కంపెనీలు ఉండగా.. ఆ స్టాక్స్ దారుణంగా పడుతున్నాయి. దీంతో ఈ ఏడాదిలోనే ఇప్పటివరకు అంటే 9 నెలల్లో 75 బిలియన్ డాలర్లకుపైగా తగ్గింది. భారత కరెన్సీలో చూస్తే ఇది రూ. 6.6 లక్షల కోట్లుగా ఉంటుంది. ఇక్కడ మరో షాక్ ఏంటంటే.. దీంట్లో ఐదో వంతు ఈ నెల 19 తర్వాతే తగ్గింది. ఇప్పుడు టాటా గ్రూప్‌లోని 16 లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ కలిపి గత శుక్రవారం సెషన్‌లో 287 బిలియన్ డాలర్లకు చేరింది. ఇది మన కరెన్సీలో రూ. 25.25 లక్షల కోట్లుగా చెప్పొచ్చు. దాదాపు రెండేళ్ల తర్వాత ఈ స్థాయికి పడిపోవడం గమనార్హం. ఇటీవల ముఖ్యంగా హెచ్1బీ వీసాల ఫీజుల్ని అమెరికా పెంచడం, ఇతర ఆంక్షలు సహా సైబర్ దాడుల వరకు ఇలా ఎన్నో సవాళ్లు ఎదురవగా.. టాటా గ్రూప్ మార్కెట్ వాల్యుయేషన్ ఈ నెల 19 నుంచే 20 బిలియన్ డాలర్లకుపైగా తగ్గింది. >> టాటా గ్రూప్‌లో అతిముఖ్యమైన, అతిపెద్దదైన కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్. ఈ ఐటీ కంపెనీ స్టాక్ గత వారంలో 8 శాతానికిపైగా పడిపోయింది. ఒక వారంలో ఇంతలా నష్టపోవడం 2020 తర్వాత ఇదే తొలిసారి. ట్రంప్ సర్కార్.. H1B వీసాల దరఖాస్తు ఫీజును లక్ష డాలర్లకు పెంచడంతో.. ఐటీ కంపెనీలపై ప్రభావం పడుతుంది. ఈ క్రమంలోనే ఆఫ్ షోర్ కాంట్రాక్స్ విషయంలో.. ఆచితూచి వ్యవహరించాల్సి వస్తోందని.. దీంతో కొన్ని త్రైమాసికాల వరకు కొత్త కాంట్రాక్టుల బుకింగ్స్‌పై ప్రభావం ఉంటుందని భావిస్తున్నారు. ఇటీవల టాటా గ్రూప్ కంపెనీ జాగ్వార్ ల్యాండ్ రోవర్‌పై సైబర్ అటాక్ జరిగింది. ఈ క్రమంలో దీని పేరెంట్ కంపెనీ టాటా మోటార్స్ షేర్ ధర వారంలో 5 శాతం వరకు పడిపోయింది. దీంతో టాటా గ్రూప్ భవిష్యత్తు అంచనాల్ని మూడీస్ తగ్గించింది. టాటా గ్రూప్‌లోని 16 కంపెనీల్లో 12 సంస్థల షేర్లు ఈ సంవత్సరం పడిపోయాయి. తేజస్ నెట్‌వర్క్స్ తన మార్కెట్ వాల్యూలో సగం కోల్పోయింది. నెల్కో మూడో వంతు పతనమైంది.