తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న గ్రూప్ 2 నియామకాల ప్రక్రియ తుది ఘట్టానికి చేరుకుంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి బాధ్యత వహించే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC).. 783 ఉద్యోగాలకు సంబంధించిన తుది ఫలితాలను ప్రకటించడానికి సర్వం సిద్ధం చేసింది. గ్రూప్ 2 ఫలితాల విడుదలకు ముహూర్తం.. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ప్రక్రియ ఊపందుకున్న నేపథ్యంలో.. టీజీపీఎస్సీ గ్రూప్ 2 తుది ఫలితాలను విడుదల చేయడానికి సిద్ధమైంది. ఇప్పటికే అభ్యర్థుల సర్టిఫికేట్ల పరిశీలన (Certification Verification) కార్యక్రమం విజయవంతంగా పూర్తి చేసింది. సెప్టెంబర్ 28వ తేదీన మొత్తం 783 పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను విడుదల చేయనున్నట్లు కమిషన్ విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల గ్రూప్ 1 పరీక్షల ఫలితాలు విడుదల కావడం.. ఎంపికైన వారికి ముఖ్యమంత్రి చేతుల మీదుగా నియామక పత్రాలు అందించడం వంటి శుభపరిణామాలు చోటుచేసుకున్న నేపథ్యంలో.. గ్రూప్ 2 తుది ఫలితాల విడుదల కూడా వేగవంతమైంది. గ్రూప్ 1 వ్యవహారంలో ఉన్న న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోవడంతో.. మిగిలిన నియామక ప్రక్రియలకు గ్రీన్ సిగ్నల్ లభించినట్లయింది. గ్రూప్ 2 నియామకాలపై అదనపు వివరాలు.. ఈ గ్రూప్ 2 నోటిఫికేషన్ ద్వారా వివిధ కీలక విభాగాలలో మొత్తం 783 ఖాళీలను భర్తీ చేయనున్నారు. వీటిలో డిప్యూటీ తహసీల్దార్, సబ్ రిజిస్ట్రార్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ వంటి ముఖ్యమైన పోస్టులు ఉన్నాయి. ఈ పరీక్ష కోసం రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది అభ్యర్థులు తీవ్రంగా శ్రమించారు. తెలంగాణ ఉద్యమంలో ప్రధాన అంశంగా ఉన్న ఉద్యోగాల కల్పన అంశానికి ఈ నియామకాలు మరింత బలం చేకూరుస్తాయి. కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో పరిపాలనను మరింత బలోపేతం చేయడానికి.. ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత వేగంగా అందించడానికి ఈ కొత్త నియామకాలు తోడ్పడతాయి. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో పారదర్శకత, సామర్థ్యాన్ని నిరూపించుకోవడానికి కమిషన్ ప్రయత్నించింది. ఈ ఫలితాల ప్రకటనతో కేవలం ఎంపికైన అభ్యర్థులకే కాకుండా, వారి కుటుంబాలకు, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు కూడా సానుకూల ప్రభావం పడుతుందని విద్యా నిపుణులు అంచనా వేస్తున్నారు. అభ్యర్థులు తుది ఎంపిక జాబితా కోసం TSPSC అధికారిక వెబ్‌సైట్‌ను నిరంతరం పరిశీలించాల్సి ఉంటుంది. ఈ ఫలితాలు విడులైన తర్వాత వెను వెంటనే గ్రూప్ 3 ఫలితాలు వెల్లడయ్యే అవకాశాలు ఉన్నాయి.