తర్వాత, భారత కెప్టెన్ చేసిన పని క్రికెట్ అభిమానుల హృదయాలను తాకింది. ఆ దుఃఖ సమయంలో కూడా జట్టుతో కొనసాగిన అతనికి సూర్యకుమార్ ఒక పెద్దన్నయ్యలా ప్రోత్సాహం అందించాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం సూర్యకుమార్ వెల్లలాగే దగ్గరకు వెళ్లి అతని ఛాతీపై చేయి వేసి ధైర్యం చెప్పాడు. దాదాపు రెండు నిమిషాల పాటు ఇద్దరూ మాట్లాడుకున్నారు. సూర్యా పలికిన ప్రతి మాటకు వెల్లలాగే తల ఊపుతూ ధైర్యం పొందినట్లు కనిపించాడు. చివరగా అతన్ని తట్టి ప్రోత్సహించిన సూర్యకుమార్ వెళ్లిపోతుండగా, వెల్లలాగే కృతజ్ఞతతో ఆయన్ను చూసి హగ్ చేసుకున్నాడు. ఈ వీడియోను సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్ తమ అధికారిక సోషల్ మీడియా పేజీలో "ఈ క్షణం" అనే క్యాప్షన్‌తో షేర్ చేయగా, అభిమానులు విపరీతంగా స్పందించారు. అఫ్ఘనిస్తాన్‌తో జరిగిన గ్రూప్ మ్యాచ్‌ తర్వాత కోచ్ సనత్ జయసూర్యే వెల్లలాగేకు తన తండ్రి మరణ వార్త చెప్పాడు. ఆ వెంటనే అతను కొలంబోకి వెళ్లి అంత్యక్రియలకు హాజరయ్యాడు. కానీ జట్టుపై తన బాధ్యతను నెరవేర్చేందుకే సూపర్ - 4లో బంగ్లాదేశ్‌తో మ్యాచ్ రోజు మళ్లీ యూఏఈకి చేరుకున్నాడు. ఆ మ్యాచ్‌లో వికెట్ తీయలేకపోయాడు. ఆ తర్వాత పాకిస్తాన్, భారత్‌తో జరిగిన కీలక మ్యాచ్‌ల్లో జట్టులో చోటు దక్కలేదు. అయినా అతనిపై ఆటగాళ్లు చూపిన మానవీయత ప్రత్యేకం. పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా, కోచ్ మైక్ హెసన్, మేనేజర్ నవీద్ అక్రం కూడా వెల్లలాగేను కలసి సానుభూతి వ్యక్తం చేశారు. ఇక భారత్ - శ్రీలంక మ్యాచ్ విషయానికి వస్తే.. శ్రీలంక 203 లక్ష్యాన్ని చేధించేందుకు బలంగా పోరాడింది. పాతుమ్ నిశాంక సెంచరీతో శ్రీలంక గెలుపు దిశగా దూసుకెళ్లినప్పటికీ, ఆఖరి ఓవర్‌లో అతని వికెట్‌తో మ్యాచ్ సూపర్ ఓవర్‌కు చేరింది. ఆర్ష్‌దీప్ సింగ్ సూపర్ ఓవర్‌లో కేవలం రెండు పరుగులు మాత్రమే ఇచ్చి లంకను కట్టడి చేశాడు. వెంటనే వనిందు హసరంగ వేసిన తొలి బంతికే సూర్యకుమార్ విన్నింగ్ షాట్ ఆడి భారత్‌ను గెలిపించాడు. సెప్టెంబర్ 28, ఆదివారం జరగబోయే ఫైనల్‌లో భారత్ - పాకిస్తాన్ తలపడనున్నాయి.