ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు.. ఈ ఐదు స్టేషన్‌లలో ఆగుతుంది

Wait 5 sec.

దేశంలో రైల్వేశాఖ అమృత్ భారత్ రైళ్లను తీసుకొస్తోంది.. సామాన్య ప్రయాణికులకు తక్కువ ఖర్చుతో, వేగంగా సుదూర ప్రాంతాలకు ప్రయాణించే అవకాశం కల్పిస్తోంది. తాజాగా ఏపీ మీదుగా నడిచే కొత్త అమృత్ భారత్ రైలు ఇవాళ ప్రారంభం అవుతోంది. ఒడిశా నుంచి గుజరాత్‌ రాష్ట్రాలకు ఈ రైలును నడుపుతుండగా ఏపీ మీదుగా ఈ అమృత్‌ భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు నడుస్తుంది. ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్‌ విధానంలో అమృత్‌భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలును ప్రారంభిస్తారు. ఈ రైలు ఒడిశాలోని బ్రహ్మపుర రైల్వే స్టేషన్ నుంచి గుజరాత్‌ రాష్ట్రంలో సూరత్‌ సమీపంలోని ఉద్నా రైల్వే స్టేషన్ వరకు నడుస్తుంది. ఈ రైలును అందుబాటులోకి తీసుకురావడంతో ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల కోరిక నెరవేరబోతోంది. ఎందుకంటే ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి గుజరాత్‌కు వెళ్లే వారికి బెర్త్‌ల సమస్య తగ్గుతుంది. ఉత్తరాంధ్రకు చెందిన చాలా మంది సూరత్‌, రాయపూర్‌, భిలాయ్‌, అహ్మదాబాద్‌, గాంధీదామ్‌ వంటి ప్రాంతాల్లో పని చేస్తున్నారు. వారికి ఆ ప్రాంతాలకు వెళ్లడానికి రైలు సౌకర్యం ఉన్నా, బెర్త్‌లు దొరకడం కష్టం అవుతోంది. దీంతో వారు జనరల్‌ భోగీల్లో ప్రయాణిస్తూ చాలా ఇబ్బందులు పడుతున్నారు. గుజరాత్‌ వరకు ప్రత్యేక రైలు నడపాలని ఈ ప్రాంత ప్రజలు ఎప్పటి నుంచో కోరుతున్నారు. ఇప్పుడు రావడంతో తమ కష్టాలు తీరతాయని వారు ఆశిస్తున్నారు. ఈ రైలు ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల గుండా ఈ రైలు వెళ్తుంది. పలాస, శ్రీకాకుళంరోడ్‌, విజయనగరం, బొబ్బిలి, పార్వతీపురం రైల్వేస్టేషన్లలో ఈ రైలు ఆగుతుంది. ఈ రైలు ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర, గుజరాత్‌ రాష్ట్రాల మీదుగా ప్రయాణిస్తుంది. ఇది వస్త్ర, వాణిజ్య కేంద్రాలను కలుపుతుంది. ఈ అమృత్‌ భారత్‌ రైలు (19022) శనివారం మధ్యాహ్నం 12 గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు ఉదయం 9 గంటలకు సూరత్‌ (ఉద్నా) చేరుకుంటుంది. ఈ రైలు ఆధునిక LHB కోచ్‌లతో తయారు చేశారు.. ప్రయాణికులకు మంచి సీటింగ్‌, మెరుగైన సౌకర్యాలు ఉంటాయి. మొత్తం 22 కోచ్‌లలో జనరల్, స్లీపర్ క్లాస్, లగేజీ వ్యాన్లు, ప్యాంట్రీ కార్ ఉన్నాయి. ఈ రైలులో మొత్తం 22 కోచ్‌లు ఉండగా.. వీటిలో 11 జనరల్‌ సెకండ్‌క్లాస్‌ సిటింగ్‌ కోచ్‌లు ఉన్నాయి. భారతీయ రైల్వే పేద, మధ్యతరగతి రైలు ప్రయాణికుల కోసం అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను నడుపుతోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 11 రైళ్లు నడుస్తున్నాయి. మొత్తం మీద ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజల కల నెరవేరింది.. గుజరాత్ వైపు వెళ్లడానికి ఇబ్బందులు తొలగిపోయాయి అంటున్నారు.