మూసీ మహోగ్రరూపం.. MGBS బస్టాండ్‌లోకి భారీగా వరద.. చిక్కుకుపోయిన ప్రయాణికులు

Wait 5 sec.

తెలంగాణ వ్యాప్తంగా గురువారం రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు హైదరాబాద్ నగరంలో జన జీవనం స్తంభించిపోయింది. దీనితి తోడు జంట జలాశయాలైన హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్‌ నిండుకుండలా మారడంతో గేట్లను ఎత్తి భారీగా నీటిని దిగువకు విడుదల చేశారు. ఎగువన కురిసిన వర్షాల కారణంగా ప్రవాహం పెరగడంతో మొదట 13,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేయగా.. శుక్రవారం రాత్రి 8 గంటల తర్వాత దానిని 35,000 క్యూసెక్కులకు పెంచడంతో మూసీ నది ఇటీవల కాలంలో ఎన్నడూ లేనంతగా మహోగ్రరూపం దాల్చింది.శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత చాదర్‌ఘాట్‌ లోలెవల్‌ వంతెన పైనుంచి ఆరు అడుగుల మేర వరద ప్రవహించింది. మూసారాంబాగ్‌ వంతెన పైనుంచి ఏకంగా 10 అడుగుల మేర నీరు ప్రవహించింది. ఎంజీబీఎస్‌ (మహాత్మాగాంధీ బస్‌ స్టేషన్‌) లోకి వెళ్లే రెండు వంతెనలు పూర్తిగా నీట మునిగిపోయాయి. వరద నీరు నేరుగా బస్డాండ్‌లోకి చేరడంతో వేల మంది ప్రయాణికులు చిక్కుకుపోయారు. పోలీసులు వారిని తాళ్ల సహాయంతో బయటకు తీసుకొచ్చారు. చాదర్‌ఘాట్‌ కాజ్‌వే వంతెన, మూసారాంబాగ్‌ బ్రిడ్జితో సహా పలు ప్రాంతాల్లో రహదారులను పూర్తిగా మూసివేసి ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. దీని ప్రభావంతో దిల్‌సుఖ్‌నగర్, కోఠి మధ్య తీవ్ర ట్రాఫిక్‌ అంతరాయం ఏర్పడింది.పరిస్థితి తీవ్రత దృష్ట్యా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అర్ధరాత్రి సమీక్ష నిర్వహించారు. బస్డాండ్‌లో చిక్కుకుపోయిన ప్రయాణికులను సురక్షితంగా బయటికి తీసుకురావాలని పోలీసు, హైడ్రా, జీహెచ్‌ఎంసీ అధికారులను అప్రమత్తం చేశారు. మూసీ పరివాహక ప్రాంతాలైన అంబేడ్కర్‌ బస్తీ, మూసానగర్, శంకర్‌నగర్‌ బస్తీల్లోని పలు కాలనీలు నీట మునిగాయి. అధికారులు వందల మందిని సమీపంలోని పునరావాస కేంద్రాలకు తరలించారు. ఇళ్లను ఖాళీ చేయడానికి నిరాకరించిన కొన్ని కుటుంబాలను పోలీసులు బలవంతంగా బయటకు తరలించారు. వరదల కారణంగా నగరం నలుమూలలా రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నార్సింగి వద్ద ఓఆర్‌ఆర్‌ సర్వీసు రోడ్లు మూసుకుపోవడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. పటాన్‌చెరు వైపు జాతీయ రహదారి (NH 65) నీట మునిగింది. ఇస్నాపూర్‌ నుంచి రుద్రారం మధ్య జాతీయ రహదారిపై మోకాలి లోతు వరద ప్రవహించింది.శంషాబాద్‌ విమానాశ్రయంలో కూడా వాతావరణం అనుకూలించకపోవడంతో ముంబయి, కోల్‌కతా, పుణె నుంచి వచ్చిన మూడు ఇండిగో విమానాలను దిగడానికి అనుమతి లభించక, వాటిని విజయవాడకు తరలించారు. జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆర్వీ.కర్ణన్‌ ప్రజలు హెచ్చరికలు జారీ చేశారు. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని విజ్ఞప్తి చేశారు.