అనంతపురం జిల్లాలో తిరుపతి - కదిరిదేవరపల్లి ప్యాసింజర్‌ రైలును దొడ్డహళ్లి వరకు పొడిగించాలని ప్రతిపాదన ఉంది. ఈ రైలు కంబదూరు మీదుగా వెళ్తుంది. కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు, అనంతపురం అంబికా లక్ష్మీనారాయణ ఈ ప్రతిపాదనను కేంద్ర రైల్వే శాఖ సహాయమంత్రి సోమన్నకు తెలిపారు. దీనిపై రైల్వే సేఫ్టీ అధికారులు శుక్రవారం 20 కిలోమీటర్లకు పైగా ట్రాక్‌ను రైలు ఇంజిన్‌తో పరిశీలించారు. కదిరిదేవరపల్లి నుండి దొడ్డహళ్లి వరకు ఉన్న రైల్వే ట్రాక్‌ను పరిశీలించారు. కంబదూరుకు త్వరలోనే రైలు వస్తుందని భావిస్తున్నారు. ప్రస్తుతం కదిరిదేవరపల్లి వరకు నడుస్తున్న తిరుపతి ప్యాసింజర్ రైలును దొడ్డహళ్లి వరకు పొడిగిస్తే బావుంటుందని ఎంతోకాలంగా స్థానికులు కోరుతున్నారు. అందుకే ఎమ్మెల్యే, ఎంపీలు ఈ విషయాన్ని కేంద్ర రైల్వే శాఖ సహాయమంత్రి సోమన్న దృష్టికి తీసుకెళ్లారు. ఆయన కూడా సానుకూలంగా స్పందించడంతోనే రైల్వే సేఫ్టీ అధికారులు చర్యలు తీసుకున్నారని చెబుతున్నారు. కంబదూరు వరకు రైల్వే ట్రాక్‌ పనులు పూర్తయ్యాయి కానీ ఇప్పటివరకు కంబదూరుకు రైలు నడవడం లేదు. ఈ పరిశీలన తర్వాత కంబదూరుకు రైలు త్వరలోనే వచ్చే అవకాశం ఉంది. ఆ రైలుకు ప్రయాణికుల రద్దీ పెరిగింది రైలుకు ప్రయాణికుల రద్దీ బాగా పెరిగింది. మూడు నెలల క్రితం అనంతపురం వరకు ఈ రైలు సేవలు మొదలయ్యాయి. ప్రయాణం చౌకగా ఉండటంతో ప్రజలు ఈ రైలులో వెళ్ళడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ రైలు మొదట పుట్టపర్తి-బెంగళూరు (66559/66560) మధ్య నడిచేది. తర్వాత దీన్ని అనంతపురం వరకు పొడిగించారు. బెంగళూరులో ఉదయం 8.35 గంటలకు బయలుదేరి, మధ్యాహ్నం 1.55 గంటలకు అనంతపురం చేరుకుంటుంది. తిరిగి మధ్యాహ్నం 2.10 గంటలకు అనంతపురం నుండి బయలుదేరి, రాత్రి 7.50 గంటలకు బెంగళూరు చేరుకుంటుంది. ముందు ఈ వేళలు ప్రయాణికులకు అంత సౌకర్యంగా ఉండవని చాలా మంది అనుకున్నారు. కానీ, రైలు ప్రయాణం తక్కువ ఖర్చుతో అందుబాటులోకి రావడంతో పరిస్థితి మారింది. ఇప్పుడు ప్రయాణికులు వేచి ఉండి మరీ ఈ రైలులో వెళ్తున్నారు. ఈ రైలు బెంగళూరు నుంచి అనంతపురం వరకు 27 స్టేషన్లలో ఆగుతోంది.. దీంతో గ్రామాలకు వెళ్లే వారికీ అనుకూలంగా ఉంది అంటున్నారు.