ఇటీవలి కాలంలో సైబర్ మోసాలు పెరిగిపోయాయి.. సామాన్యుడి నుంచి సెలబ్రిటీ వరకు అందరూ సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోతున్నారు. ఇటీవల కాలంలో ఏపీకి చెందిన పలువురు ప్రజా ప్రతినిధులు, ప్రముఖులు సైబర్ కేటుగాళ్ల వలకు చిక్కారు. తాజాగా మరో టీడీపీ ఎమ్మెల్యే మోసపోయారు. నెల్లూరు జిల్లా కావలి ఎమ్మెల్యే డీవీ కృష్ణారెడ్డి సైబర్‌ నేరగాళ్ల మోసానికి గురయ్యారు. ఆగస్టు 22న ఫోన్‌కు వచ్చిన ఒక లింకును ఆయన క్లిక్ చేయడంతో ఇదంతా జరిగింది. ఆయన ఆలస్యంగా సైబర్ మోసం గురించి తెలుసుకున్నారు.. అయితే అప్పటికే జరగాల్సింది జరిగిపోయింది. కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి వ్యక్తిగత వాట్సప్‌ నంబర్‌కు ఆగస్టు 22న ఆర్టీఏ బకాయిలు చెల్లించాలని ఒక లింకు వచ్చింది. తన కంపెనీ వాహనాలకు సంబంధించిన బకాయిలు అనుకుని ఆయన ఆ లింకును నొక్కారు. వెంటనే ఆయన సిమ్ కార్డు బ్లాక్ కావడంతో.. ఈ సమస్యను పరిష్కరించడానికి ఆయన హైదరాబాద్‌లోని ఆధార్‌ విజిలెన్స్‌ విభాగాన్ని సంప్రదించారు. 25 రోజుల తర్వాత ఆయన సిమ్ మళ్లీ పనిచేయడం మొదలుపెట్టింది. అయితే సిమ్ యాక్టివేట్ అయిన తర్వాత, ఆయనకు అసలు ట్విస్ట్ ఎదురైంది.గత నెల 25వ తేదీ నుంచి ఈ నెల 16వ తేదీ వరకు ఆయన రెండు యాక్సిస్ బ్యాంక్ ఖాతాల నుంచి రూ.23,16,009 నగదు యూపీఐ ద్వారా దశల వారీగా మాయమైంది. ఈ విషయాన్ని ఆయన కంపెనీ సిబ్బంది ద్వారా ఆలస్యంగా తెలుసుకున్నారు. ఇది సైబర్‌ నేరగాళ్ల పనే అని ఆయన గుర్తించారు. వెంటనే గురువారం కావలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఈ సైబర్ మోసంపై దర్యాప్తు చేస్తున్నారు. మొన్నటి వరకు సామాన్యులకు ఈ సైబర్ మోసాలు ఎదురయ్యాయి. ఇటీవల కాలంలో ప్రముఖులకు ఈ సమస్య ఎదురవుతోంది. అందుకే వాట్సాప్‌కు వచ్చే అనుమానాస్పదద లింకుల్ని నొక్కకూడదని పోలీసులు పదే, పదే హెచ్చరిస్తున్నారు. ఏపీకే ఫైల్స్ విషయంలో జాగ్రత్తలు అవసరం అంటున్నారు. ఇటీవల , కూడా సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయారు.