తిరుమల శ్రీవారి భక్తుల కోసం మరో కొత్త విమాన సర్వీస్ అందుబాటులోకి రాబోతున్న సంగతి తెలిసిందే. రాజమహేంద్రవరం-తిరుపతి కొత్త విమాన సర్వీసు అక్టోబరు 1న ప్రారంభంకానుంది. ఈ విమాన సర్వీస్‌ టికెట్లకు సంబంధించి ఎలియన్స్‌ ఎయిర్‌‌లైన్స్ సంస్థ ప్రయాణికులకు బంపరాఫర్ ప్రకటించింది. అక్టోబరు 2, 4, 6 తేదీలలో టికెట్ ధర రూ.1,499 మాత్రమే.. ప్రయాణికులను ఆకర్షించడమే లక్ష్యంగా ఈ ఆఫర్ ప్రకటించారు. ఈ కొత్త విమాన సర్వీసు ప్రారంభోత్సవం సందర్భంగా ఈ ఆఫర్ ప్రకించారు. వాస్తవానికి ముందు ఎలియన్స్‌ ఎయిర్‌ టికెట్ ధరను రూ.1,999గా నిర్ణయించారు.. తాజాగా దానిని రూ.1499కు మార్చారు. అక్టోబరు 2, అక్టోబరు 4, అక్టోబరు 6 తేదీలలో ఆ ఆఫర్ వర్తిస్తుందని ఎలియన్స్‌ విమాన సంస్థ రాజమహేంద్రవరం మేనేజరు తెలిపారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌ నాయుడు పై స్పందించారు. అక్టోబర్ 1 నుంచి రాజమహేంద్రవరం, తిరుపతి మధ్య అలయన్స్ ఎయిర్ (ATR 72) విమానాలు నడుస్తాయని.. ఈ సర్వీసులు వారంలో మూడు రోజులు అందుబాటులో ఉంటాయన్నారు. అక్టోబర్ 1న ఉదయం 9:25 గంటలకు తిరుపతి నుంచి బయలుదేరిన విమానం రాజమహేంద్రవరం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణం ఉదయం 10:15 గంటలకు మొదలవుతుంది.అక్టోబర్ 2వ తేదీ నుంచి మాత్రం ఈ విమాన సర్వీసులు మంగళవారం, గురువారం, శనివారం నాడు అందుబాటులో ఉంటాయి. ఆ మూడు రోజుల్లో ఉదయం 07:40 గంటలకు తిరుపతి నుంచి బయలుదేరుతుంది.. ఉదయం 9:25 గంటలకు రాజమహేంద్రవరం చేరుకుంటుంది. ఈ విమానం తిరుగు ప్రయాణంలో రాజమహేంద్రవరంలో ఉదయం 9:50 గంటలకు బయలుదేరి.. ఉదయం 11:20 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. ఈ విమానం తిరుమల వెళ్లే భక్తులకు చాలా ఉపయోగంగా ఉంటుందని భావిస్తున్నారు. అయితే విమానం ప్రారంభించిన తర్వాత మూడు రోజుల పాటూ ప్రకటించిన ఆఫర్ కూడా బావుంది. రాజమహేంద్రవరం నుంచి తిరుమలకు వెళ్లాలనుకునే భక్తులకు ఇది మంచి అవకాశం.