రనౌట్ అయినా శానకని నాటౌట్‌గా ఇచ్చారేంటీ! షాక్‌లో టీమిండియా.. అయోమయంలో ప్రేక్షకులు!! అసలు ఏం జరిగిందంటే..?

Wait 5 sec.

ఈ టోర్నీలో ఫస్ట్ టైమ్ 200కు పైగా స్కోర్ నమోదవ్వగా.. శ్రీలంక కూడా ఛేజింగ్‌లో అంతే స్కోర్ చేసి అందర్నీ షాక్‌లోకి పంపింది. ఆఖరి ఓవర్ డ్రామాతో మ్యాచ్ టైగా ముగిసి.. సూపర్ ఓవర్ వరకూ వెళ్లింది. ఇలా మ్యాచ్ మొత్తం ప్రేక్షకులకు ఫుల్ ఐ ఫీస్ట్ ఇచ్చిన ఈ మ్యాచ్‌లో మాత్రం అందర్నీ అయోమయానికి గురి చేసింది. చూసే ప్రేక్షకులనే కాదు.. గ్రౌండ్‌లో ఉన్న టీమిండియా ప్లేయర్లు కూడా ఎందుకు ఇలా అయిందని షాక్ అయ్యారు. సూపర్ - 4లో జరిగిన ఈ థ్రిల్లింగ్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది. ఓపెనర్ అభిషేక్ శర్మ మరోసారి 61 పరుగులతో రాణించగా, తిలక్ వర్మ 49, సంజూ శాంసన్ 39 పరుగులతో ఆకట్టుకున్నారు. అయితే భారీ స్కోర్ ఛేజింగ్‌లో శ్రీలంక కూడా ఎక్కడా తగ్గలేదు. ఓపెనర్ పాతుమ్ నిశాంక అద్భుత ఇన్నింగ్స్‌తో సెంచరీ పూర్తి చేశాడు. కుశాల్ పెరీరా కూడా 58 పరుగులు చేయగా ఆఖర్లో శానక 22 పరుగులు బాదడంతో మ్యాచ్ టైగా ముగిసింది. సూపర్ ఓవర్‌లో తొలుత బ్యాటింగ్‌కి వచ్చిన శ్రీలంక మొదటి బంతికే పెరీరా వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత మెండిస్ క్రీజులోకి వచ్చి, సింగిల్ తీశాడు. దాంతో శానక స్ట్రయికింగ్‌లోకి రాగా అర్షదీప్ వరుసగా డాట్స్ చేశాడు. మూడో బంతిని షాట్ ఆడే ప్రయత్నంలో ముందుకు రాగా బంతి మిస్సయింది. దాంతో రన్ తీసే ప్రయత్నం చేయగా కీపర్ సంజూ శాంసన్ రనౌట్ చేశాడు. అంపైర్‌కి అప్పీల్ చేయడంతో దాన్ని అవుట్‌గా ప్రకటించాడు. ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. నాన్ స్ట్రయిక్ ఎండ్‌కి వచ్చిన శానక థర్డ్ అంపైర్ రివ్యూకి వెళ్లాడు. అదేంటి క్లియర్ రనౌట్ అయినప్పటికీ థర్డ్ అంపైర్‌కి ఎందుకు వెళ్లాడో ఎవ్వరికీ అర్థం కాలేదు. కట్ చేస్తే థర్డ్ అంపైర్ దాన్ని నాటౌట్‌గా ప్రకటించాడు. సంజూ అండర్ ఆర్మ్‌గా త్రో విసిరి క్లియర్ రనౌట్ చేస్తే.. ఇప్పుడు థర్డ్ అంపైర్ నాటౌట్‌గా ప్రకటించాడేంటి అని మ్యాచ్ చూసేవాళ్లతో పాటు గ్రౌండ్‌లో ఉన్న ప్లేయర్లు కూడా షాక్ అయ్యారు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అయితే ఏకంగా అంపైర్ దగ్గరకు వెళ్లి ఎందుకు అంటూ అడిగాడు. అది ఎందుకు నాటౌట్ అంటే..?అర్షదీప్ వేసిన ఆ బంతి కీపర్ చేతుల్లోకి వెళ్లగానే బౌలర్, సంజూ శాంసన్ ఇద్దరూ అప్పీల్ చేశారు. దాంతో అంపైర్ అవుట్‌గా ప్రకటించాడు. అయితే, అంపైర్ గాజీ సోహెల్ అది కీపర్ క్యాచ్ అవుట్ ఇచ్చాడు. దాంతో శానక రివ్యూ తీసుకున్నాడు. ఎప్పుడైతే ఓ ప్లేయర్ రివ్యూకి వెళ్తాడో.. అప్పటి నుంచి బంతి డెడ్ అవుతుంది. అంటే.. ఇప్పుడు కీపర్ క్యాచ్ పట్టుకొని అంపైర్ అవుట్ ఇవ్వగానే అది డెడ్ బాల్ అయింది. దాంతో, ఐసీసీ రూల్స్ ప్రకారం అంపైర్ అవుట్ ఇచ్చిన తర్వాత రనౌట్ చేసినా.. రన్స్ తీసినా అవి కౌంట్‌లోకి రావు. ఈ రూల్ ప్రకారమే సంజూ శాంసన్ రనౌట్ చేసినప్పటికీ అది నాటౌట్ అయింది. ఆ బంతికి సేఫ్ అయిన శానక.. ఆ తర్వాత బంతికే అవుటయ్యాడు. అర్షదీప్ వేసిన బంతిని ఆఫ్ సైడ్ గాల్లోకి లేపగా జితేశ్ శర్మ దాన్ని క్యాచ్‌గా అందుకున్నాడు. ఈ సూపర్ ఓవర్‌లో శ్రీలంక కేవలం రెండు పరుగులే చేసి రెండు వికెట్లు కోల్పోయింది. సూపర్ ఓవర్‌లో రెండు వికెట్లు కోల్పోతే ఆలౌట్ అని అర్థం. దాంతో మరో రెండు బంతులు మిగిలుండగానే లంక ఇన్నింగ్స్ ముగిసింది. మూడు పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ తొలి బంతికే విజయం సాధించింది. కెప్టెన్ సూర్య ఫస్ట్ బంతినే బౌండరీ వైపు మళ్లించి మూడు పరుగులు తీశాడు. మొత్తానికి ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో భారత్ సూపర్ ఓవర్‌లో విజయం సాధించింది.