తిరుమల శ్రీవారి లడ్డూ, అన్నప్రసాదాల నాణ్యత కోసం ప్లాన్ అదిరింది.. AI సాయంతో రెండు మెషిన్లు

Wait 5 sec.

తిరుమల శ్రీవారి అన్నప్రసాదాలు, లడ్డూల నాణ్యతను మెరుగుపరచడానికి టీటీడీ కీలక ముందడుగు వేసింది. అన్నప్రసాదాలు, లడ్డూల కోసం కొనుగోలు చేసే నిత్యావసర సరుకుల్లో 100 శాతం నాణ్యత ఉండేలా చూసేందుకు 'విజన్‌ బేస్డ్‌ సార్టింగ్‌ యంత్రాలను' అందుబాటులోకి తెచ్చింది. గతంలో బియ్యం, పప్పులు వంటి సరుకుల నాణ్యత తనిఖీలో లోపాలు జరిగాయి. వాటిని సరిదిద్ది, భక్తులకు నాణ్యమైన ప్రసాదాలు అందించేందుకు ఈ కొత్త యంత్రాలను ప్రారంభించారు. ఈ 'విజన్‌ బేస్డ్‌ సార్టింగ్‌ యంత్రాలు' సరుకులను చూసి, వాటిలోని లోపాలను గుర్తిస్తాయి. చెడిపోయినవి, నాణ్యత లేనివి వేరు చేస్తాయి. టీటీడీ బియ్యం, పప్పుదినుసులు, జీడిపప్పు, యాలకులు, లవంగాలు వంటి అనేక రకాల సరుకులను కొనుగోలు చేస్తుంది. ఈ యంత్రాల వల్ల ఈ సరుకులన్నీ అత్యుత్తమ నాణ్యతతో ఉంటాయి.గతంలో టీటీడీ వివిధ సంస్థల నుంచి సరుకులు కొనుగోలు చేసేది. వాటిని ల్యాబ్‌లో పరిశీలించినా కొన్ని తప్పులు జరిగాయి. నాణ్యత లేని సరుకులను కూడా చూసీచూడనట్లు అనుమతించిన ఘటనలు గత ప్రభుత్వంలో జరిగాయనే విమర్శలు ఉన్నాయి. అందుకే టీటీడీ ఇప్పుడు మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. ఈ కొత్త యంత్రాలతో నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడకుండా చూస్తుంది. ఇటీవల టీవీఎస్‌ సంస్థ శ్రీవారి ఆలయానికి రూ.40 లక్షల విలువైన రెండు అధునాతన యంత్రాలను అందించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు బ్రహ్మోత్సవాల సందర్భంగా వీటిని ప్రారంభించారు. ఈ యంత్రాలు ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) సాంకేతికతతో నిత్యావసర సరకులు, పప్పుదినుసుల నాణ్యతను పరీక్షిస్తాయి. కల్తీని, నాణ్యత లేని వాటిని తొలగిస్తాయి. దీనివల్ల ఆలయ పోటుకు వంద శాతం నాణ్యమైన సరకులు మాత్రమే వెళ్తాయి. ఈ యంత్రాలను శ్రీవారి ఆలయం వెనుక ఉన్న ఉగ్రాణంలో ఏర్పాటు చేశారు. నిత్యావసర సరకులు, పప్పుదినుసులను మొదట ఈ యంత్రంలో వేస్తారు. ఏఐ సాంకేతికతతో ఇవి వాటిని గ్రేడింగ్ చేస్తాయి. ఉదాహరణకు, బియ్యంలో రాళ్లు ఉన్నా, జీడిపప్పు నాణ్యత లేకపోయినా గుర్తిస్తాయి. పప్పుదినుసుల్లో కల్తీ ఉంటే ఈ యంత్రాలు వెంటనే గుర్తిస్తాయి. వాటిని తొలగిస్తాయి. దీనివల్ల ఆలయ పోటుకు వంద శాతం నాణ్యమైన పప్పుదినుసులు, బియ్యం మాత్రమే వెళ్తాయి. ఈ స్వచ్ఛమైన సరకులతోనే అన్నప్రసాదాలు, లడ్డూలు తయారుచేస్తారు. వాటిని స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తారు. 'తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా శుక్రవారం రాత్రి భక్తులకు అందుతున్న సౌకర్యాలపై టిటిడి చైర్మెన్ బీఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్ అడిగి తెలుసుకున్నారు. శుక్రవారం రాత్రి ముత్యపు పందిరి వాహనంలో భాగంగా ఆలయ నాలుగు మాడ వీధులలో పలు గ్యాలరీలలోని భక్తులతో ఛైర్మెన్ , ఈవో మాట్లాడారు. శ్రీవారి దర్శనం, అన్నప్రసాదాలు, వసతి, రవాణా, కాలినడకన వచ్చే భక్తులకు టిటిడి అందిస్తున్న సౌకర్యాలపై భక్తులతో మాట్లాడారు. అన్నప్రసాదాలు, లడ్డూ ప్రసాదాలు చాలా రుచికరంగా ఉన్నాయని, టిటిడి అందిస్తున్న సేవలపై వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు సంతోషం వ్యక్తం చేశారు. భక్తులకు మరింత మెరుగైన సేవలు అందిస్తామని ఈవో తెలిపారు. భక్తుల నుండి ఫీడ్ బ్యాక్ సేకరించి వారి సూచనల మేరకు సౌకర్యాలు అందిస్తామన్నారు. పలువురు శ్రీవారి సేవకులు, డిప్యూటేషన్ మీద వచ్చిన అధికారులు, సిబ్బందితో ఈవో మాట్లాడారు. 28వ తేదీ గరుడ సేవ నేపథ్యంలో మరింత పటిష్ట చర్యలు తీసుకోవాలని అధికారులనుఆదేశించారు. గ్యాలరీలలో భక్తులు, పలు కళా బృందాలు టిటిడి ఛైర్మన్, ఈవోలతో ఫోటోలు దిగారు' అని టీటీడీ తెలిపింది.