Stock Market: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఊహించని విధంగా మరో బాంబు పేల్చారు. ఈసారి ఫార్మా దిగుమతులే లక్ష్యంగా భారీగా టారిఫ్‌లు విధించారు. వీటితో పాటుగా ఫర్నిచర్, ట్రక్కులు, కిచెన్ ప్రొడక్ట్స్‌పై సుంకాలు పెంచారు. ఈ దెబ్బతో దేశీయ మార్కెట్ సూచీలు భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. ట్రంప్ సుంకాలకు తోడు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు సూచీలు నష్టపోయేందుకు కారణమయ్యాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ మరింత క్షీణించి రూ.88.68 వద్ద ట్రేడవుతోంది. బ్రాండెడ్, పేటెంటెడ్ మందులపై 100 శాతం దిగుమతి సుంకాలు విధిస్తున్నామని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అలాగే కిచెన్ క్యాబినెట్, బాత్‌రూమ్ పరికరాలపై 50 శాతం, అప్‌హోల్‌స్టర్డ్ ఫర్నిచర్ పై 30 శాతం, భారీ ట్రక్కులపై 25 శాతం సుంకాలు విధిస్తున్నామని చెప్పారు. అక్టోబర్ 1 నుంచే ఈ టారిఫ్స్ అమలులోకి వస్తాయని తెలిపారు. ఈ సుంకాలతో భారత్‌పై తీవ్ర ప్రభావం పడనుంది. భారత ఫార్మా ఉత్పత్తుల ఎగుమతులకు అమెరికానే అతిపెద్ద మార్కెట్‌గా ఉంది. ఫార్మా రంగంపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుందన్న అంచనాల నేపథ్యంలో ఆ రంగంలోని కంపెనీ స్టాక్స్ ఒత్తిడికి గురవుతున్నాయి. సిప్లా, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, సన్ ఫార్మా వంటి ఫార్మా రంగంలోని షేర్లు 2 శాతానికి పైగా నష్టపోయాయి. వీటితో పాటు ఇండస్ ఇండ్ బ్యాంక్, టాటా స్టీల్, టెక్ మహీంద్రా, విప్రో వంటి ఐటీ రంగ షేర్లు సైతం భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఈ కారణంతో మధ్యాహ్నం 12 గంటల సమయంలో సెన్సెక్స్ 406 పాయింట్ల నష్టంతో 80,753 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఇక నిఫ్టీ 50 ఇండెక్స్ 130 పాయింట్లు కోల్పోయి 24,760 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ బ్యాంక్ సూచీ 426 పాయింట్లు కోల్పోయి 54,549 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఈ రోజు ఇంట్రాడేలో టైటాన్ కంపెనీ, ఐసీఐసీఐ బ్యాంక్, లార్సెన్, వొడాఫోన్ ఐడియా, సన్ ఫార్మా వంటి షేర్లు ట్రెండింగ్‌లో నిలిచాయి. అయితే, ఇందులో లార్సెన్ మాత్రమే స్వల్ప లాభాల్లో కొనసాగుతుండడం గమనార్హం. 3.39 శాతం మేర లాభాల్లో కొనసాగుతోంది. ఆ తర్వాత టాటా మోటార్స్ 2.21 శాతం లాభంతో ట్రేడవుతోంది. హీరో మోటోకార్ప్, ఐచర్ మోటార్స్, మారుతీ సుజుకీ షేర్లు సైతం లాభాల్లో కొనసాగుతున్నాయి.