పాకిస్తాన్ టీమ్ ఫీల్డింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ తరం.. ఈ తరం అన్న తేడా లేకుండా ఎప్పటికప్పుడు అదే ఫీల్డింగ్‌ను ప్రదర్శిస్తూ నెట్టింట కావాల్సినంత ట్రోలింగ్ స్టఫ్ ఇస్తుంటుంది. అప్పట్లో ఒక గుండు అంకుల్ ఎక్స్‌ప్రషన్ కూడా పాక్ ఫీల్డింగ్ మిస్టేక్‌తోనే వైరల్ అయింది. తాజాగా ఆసియా కప్‌లోనూ మరోసారి పాక్ తన ఫీల్డింగ్‌తో సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కి గురైంది. సూపర్ - 4లో తాడో పేడో తేల్చుకునే బంగ్లాదేశ్ మ్యాచ్‌లో చూసి ప్రపంచం మొత్తం నవ్వేసింది. ఇద్దరు బ్యాటర్లు ఒక వైపే ఉన్నా కూడా రనౌట్ చేయలేకపోయారు. బౌలర్ బ్యాటింగ్ ఎండ్ వైపు వెళ్లగా.. కనీసం నాన్ స్ట్రయిక్ ఎండ్‌లో ఒక్కరంటే ఒక్క ఫీల్డర్ కూడా లేడు. దాంతో ఈజీ రనౌట్‌ను మిస్ చేసుకున్నారు. షాహీన్ అఫ్రిది వేసిన బంతిని బంగ్లా బ్యాటర్ తౌహిద్ హృదోయ్ పాయింట్‌లోకి ఆడాడు. అయితే, అక్కడే ఉన్న సయిమ్ అయూబ్ అద్భుతంగా బంతిని ఆపాడు. నాన్ స్ట్రయిక్‌లో ఉన్న సైఫ్ హాసన్ అప్పటికే స్ట్రయిక్ ఎండ్‌లోకి వచ్చాడు. వెంటనే సయిమ్ అయూబ్ బంతిని నాన్ స్ట్రయిక్ వికెట్ల వైపు విసిరేశాడు. అయితే, అక్కడికి ఏ ఫీల్డరూ రాలేదు. దాంతో సైఫ్ మళ్లీ నాన్ స్ట్రయిక్‌కి సేఫ్‌గా వచ్చేశాడు. అయితే, ఈ వీడియో నెట్టింట వైరల్ కావడంతో పాక్ ఫీల్డింగ్‌పై తెగ ట్రోలింగ్ చేస్తున్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే చావో రేవో అన్న మ్యాచ్‌లో బంగ్లాదేశ్ చేతులెత్తేసింది. ఈజీగా గెలవాల్సిన మ్యాచ్‌ని 11 పరుగుల తేడాతో ఓడిపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 135 పరుగులు మాత్రమే చేసింది. లో టార్గెట్ స్కోర్‌లో తడబడిన బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 124 పరుగులు మాత్రమే చేయగలిగింది. పాకిస్తాన్ పేసర్లు షాహీన్ అఫ్రిది, హారిస్ రవుఫ్ అద్భుత బౌలింగ్‌తో బంగ్లాపై ఒత్తిడి తీసుకొచ్చి మ్యాచ్ విజయంలో కీలకంగా మారారు. ఈ మ్యాచ్ విజయంతో ఆసియా కప్ 2025 ఫైనల్‌కి పాకిస్తాన్ చేరుకుంది. ఇప్పటికే ఫైనల్ రేసులో భారత్ నిలిచిన సంగతి తెలిసింది. ఈ రెండు జట్లు ఆదివారం సెప్టెంబర్ 28న తలపడనున్నాయి. ఈ టోర్నీలో భారత్ - పాక్ తలపడిన రెండు మ్యాచ్‌లలోనూ టీమిండియానే విజయం సాధించింది.