తమిళనాడులో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ.. కొన్ని నెలల క్రితం (టీవీకే) పార్టీని స్థాపించిన నటుడు .. గత కొంత కాలంగా తమిళ రాజకీయాల్లో సంచలనంగా మారారు. ఈ క్రమంలోనే వరుసగా సమావేశాలు, సభలు, ర్యాలీలు నిర్వహిస్తూ.. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని, తమిళనాడులోని స్టాలిన్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా కరూర్‌ జిల్లాలో విజయ్ నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ఊహించని విషాదం చోటుచేసుకుంది. శనివారం జరిగిన ఈ భారీ ర్యాలీలో భారీ తొక్కిసలాట జరిగింది. ఇప్పటివరకు వచ్చిన వార్తల ప్రకారం.. 30 మందికి పైగా జనం ఈ తొక్కిసలాటలో ప్రాణాలు విడిచినట్లు తెలుస్తోంది. ఇక మృతుల్లో చిన్న పిల్లలు కూడా ఉన్నట్లు తెలియడం తీవ్ర కలవరపాటుకు గురి చేస్తోంది.అయితే ఈ తొక్కిసలాటకు కారణాలు చాలా ఉన్నాయని పరిస్థితిని బట్టి చూస్తే అర్థం అవుతోంది. అనుకున్నదాని కంటే ఎక్కువగా జనం రావడం.. ర్యాలీకి విజయ్ ఆలస్యంగా రావడం, ఓ బాలిక కనిపించకుండా పోవడం వంటి అనేక కారణాలు కనిపిస్తున్నాయి. అయితే కరూర్ ర్యాలీకి 30 వేల మంది జనం వచ్చినట్లు పోలీసులు ప్రాథమికంగా వెల్లడించారు. కానీ ఈ ర్యాలీకి 10 వేల మంది వస్తారని అంచనా వేసిన టీవీకే వర్గాలు.. ప్రభుత్వం వద్ద అదే విషయాన్ని చెప్పి అనుమతి తీసుకుంది. కానీ చివరికి అంతకు 3 రెట్ల మంది రావడంతో వారిని అదుపు చేయడం పోలీసులకు తలకు మించిన భారంగా మారింది. మరోవైపు.. ఈ తొక్కిసలాటకు మరో ప్రధాన కారణం విజయ్ ఆలస్యంగా రావడమేనని స్థానికులు చెబుతున్నారు. షెడ్యూల్ ప్రకారం.. శనివారం మధ్యాహ్నం 12 గంటలకు ఆ ప్రాంతానికి చేరుకోవాల్సి ఉండగా.. విజయ్ మాత్రం సుమారు ఆరు గంటలు ఆలస్యంగా అంటే సాయంత్రం 6 గంటల సమయంలో ఆ ర్యాలీకి చేరుకున్నారు. దీంతో మధ్యాహ్నం నుంచే అక్కడికి చేరుకున్న జనం.. దాదాపు 6 గంటలకు పైగా వేచి ఉన్నారు. దీనికితోడు ఆ ప్రాంతంలో భారీగా జనం గుమిగూడటంతో.. ఉక్కపోత, రద్దీ కారణంగా అప్పటికే వారు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.మరోవైపు.. విజయ్ ప్రసంగించడానికి ముందు అభిమానులు, మద్దతుదారులు ఆయన నిలబడిన బస్సు వైపు ఒక్కసారిగా దూసుకురావడంతో కొందరు కిందపడిపోయారు. ఇదే తొక్కిసలాటకు దారితీసిందని పలువురు చెబుతున్నారు. మరోవైపు.. ఆ ర్యాలీలో ఓ బాలిక కనిపించకుండా పోవడంతో ఆమె కుటుంబ సభ్యులు వెతడకడం ప్రారంభించారు. ఇది కూడా అక్కడ గందరగోళానికి దారి తీసినట్లు తెలుస్తోంది. ఇక తొక్కిసలాట పరిస్థితిని బస్సు పైనుంచి గమనించిన విజయ్.. వెంటనే తన ప్రసంగాన్ని ఆపేసి.. జనంపైకి నీళ్ల సీసాలు విసిరేశారు. ఇక గాయపడిన వారిని తరలించేందుకు అక్కడికి వచ్చే అంబులెన్స్‌లకు దారి ఇవ్వాలని వారిని కోరారు.ఈ దుర్ఘటనపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఎక్స్ వేదికగా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కరూర్ ర్యాలీలో జరిగిన తొక్కిసలాటకు సంబంధించి వస్తున్న వార్తలు చాలా బాధాకరంగా ఉన్నాయని పేర్కొన్నారు. స్పృహ కోల్పోయిన వారికి అత్యవసరంగా చికిత్స అందించాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. తమిళనాడు ఆరోగ్య శాఖ మంత్రి, కరూర్ జిల్లా కలెక్టర్, మాజీ మంత్రి సెంథిల్ బాలాజీలకు సహాయక చర్యలు పర్యవేక్షించాలని సూచించినట్లు స్టాలిన్ తెలిపారు. యుద్ధప్రాతిపదికన సహాయ చర్యలు అందించాలని మంత్రి అన్బిల్ మహేష్‌ను ఆదేశించినట్లు చెప్పారు. పోలీసులకు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నట్లు స్టాలిన్ తన పోస్ట్‌లో వెల్లడించారు.ఇక.. దళపతి విజయ్ ర్యాలీల్లో ఇలాంటి ప్రమాదాలు జరగడం ఇదే మొదటిసారి కాకపోవడం గమనార్హం. ఈ నెలలోనే తిరుచ్చిలో జరిగిన ఆయన తొలి ర్యాలీ కూడా భారీ ట్రాఫిక్ జామ్‌కు దారితీసింది. అది అప్పట్లో తీవ్ర భద్రతాపరమైన ప్రశ్నలను లేవనెత్తింది. దీనిపై మద్రాస్ హైకోర్టు కూడా స్పందించింది. ర్యాలీలు, సభల సమయంలో భద్రతా నియమాలు పాటించడంపై టీవీకే పార్టీ ఎలాంటి బాధ్యత వహిస్తోందని ప్రశ్నించింది. పోలీసులు 23 నిబంధనలు విధించినా.. అభిమానులు వాటిని ఉల్లంఘించడం వల్లే ఈ దుర్ఘటన జరిగిందా అనే కోణంలోనూ దర్యాప్తు జరుగుతోంది.ఇక విజయ్ ర్యాలీలో తొక్కిసలాటకు సంబంధించిన ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా స్పందించారు. కరూర్‌ ఎన్నికల ప్రచార సభలో జరిగిన దురదృష్టకర సంఘటన తనను తీవ్రంగా కలచివేసిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబీకులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కష్ట సమయంలో వారికి మనోధైర్యం అందించాలని.. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని తెలిపారు.