పాలిటెక్నిక్ కాలేజీ విద్యార్థులకు ఏపీ ప్రభుత్నం శుభవార్త వినిపించింది. పాలిటెక్నిక్ కాలేజీలకు త్వరలోనే నూతన భవనాలు నిర్మించనున్నట్లు ఏపీ విద్యాశాఖ మంత్రి వెల్లడించారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఏడో రోజు ప్రశ్నోత్తరాల సమయంలో రాష్ట్రంలో ప్రైవేటు భవనాల్లో నిర్వహిస్తున్న పాలిటెక్నిక్ కాలేజీలకు సొంత భవనాలు నిర్మించే ప్రతిపాదనలపై ఎమ్మెల్యేలు పుట్టా సుధాకర్ యాదవ్ , అయితాబత్తుల ఆనందరావు, మద్దిపాటి వెంకటరాజు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ సమాధానం ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా 10 ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలకు సొంత భవనాలు లేవని నారా లోకేష్ వెల్లడించారు. అందులో రెండు పాలిటెక్నిక్ కాలేజీలకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భవన నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయని వెల్లడించారు. మిగిలిన ఎనిమిదింటిలో అయిదు పాలిటెక్నిక్ కాలేజీలకు భూములు కేటాయించినట్లు మంత్రి నారా లోకేష్ వివరించారు.*చోడవరం, పొన్నూరు, బేతంచర్ల, మైదుకూరు, గుంతకల్లు పాలిటెక్నిక్ కాలేజీలకు భూములు కేటాయించామని.. మచిలీపట్నం, కెఆర్ పురం, అనపర్తిలోని పాలిటెక్నిక్ కాలేజీలకు భూములు కేటాయించాల్సి ఉందని నారా లోకేష్ వెల్లడించారు. కేంద్రప్రభుత్వంతో చర్చించి రాష్ట్రప్రభుత్వం, ఎంపి లాడ్స్, సిఎస్ఆర్ నిధులను అనుసంధానించి ఈ పాలిటెక్నిక్ కాలేజీల భవనాలు పూర్తిచేస్తామని మంత్రి నారా లోకేష్ అసెంబ్లీలో వివరించారు. *ఎస్కేయూలో అక్రమాలపై విచారణమరోవైపు అనంతపురంలోని శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో అక్రమాలపై విచారణ జరుపుతామని మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. 2019 నుంచి 2024 మధ్య ఎస్కేయూలో అక్రమాలు జరిగాయంటూ ఆరోపణలు వచ్చాయి. కంప్యూటర్ల కొనుగోలు. విశ్వవిద్యాలయం వాహనాలకు వ్యక్తిగతంగా వాడుకోవటం , రూల్స్‌కు విరుద్ధంగా ప్రమోషన్లు, రిక్రూట్‌మెంట్లో నిబంధనల ఉల్లంఘన వంటి విషయాలపై ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ ఆరోపణలపై కమిటీ వేసి విచారణ జరుపుతామని మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. వంద రోజులలోగా వీటిపై నివేదిక తెప్పించి బాధ్యులైన వారి మీద చర్చలు తీసుకుంటామని స్పష్టం చేశారు. *అసెంబ్లీ సమావేశాల్లో భాగంగాప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేలు ఎంఎస్ రాజు, పల్లె సింధూర రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి నారా లోకేష్ ఈ మేరకు సమాధానం ఇచ్చారు. యూనివర్సిటీలను పారదర్శకంగా నడిపించాలనే లక్ష్యంతో తమ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. మరోవైపు ఆంధ్రా విశ్వవిద్యాలయంలో విద్యార్థి ఫిట్స్ కారణంగా చనిపోతే.. విద్యార్థి సంఘాలు దీనిపై ఆందోళన చేయడం సరికాదని నారా లోకేష్ అన్నారు. ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి తప్పు లేకపోయినా రాజకీయాలు చేయడం మంచిది కాదని సూచించారు. విశ్వవిద్యాలయ ఉపకులపతులను రాజకీయాలకు అతీతంగా నియమిస్తున్నట్లు తెలిపారు. ఆంధ్రా యూనివర్సిటీని దేశంలోని వంద అత్యుత్తమ విశ్వవిద్యాలయాలలో ఒకటిగా తీర్చిదిద్దే బాధ్యతను సీఎం చంద్రబాబు తనకు అప్పగించారన్న నారా లోకేష్.. స్వార్థం కోసం కొంతమంది యూనివర్సిటీలో గొడవలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.