ఏపీ ప్రజలకు శుభవార్త.. ఆ విద్యుత్ ఛార్జీలు వెనక్కి.. మొత్తం రూ..923.55 కోట్లు తిరిగి వినియోగదారులకి

Wait 5 sec.

ప్రజలకు అధికారులు తీపి కబురు చెప్పారు. సాధారణంగా విద్యుత్ శాఖ నుంచి ఏదైనా అప్డేట్ వచ్చిందంటే.. చాలా వరకు ప్రజల మీద భారం మోపేదే అనే భావన పాతుకుపోయింది. అయితే దీనికి భిన్నంగా ఏపీ విద్యుత్ శాఖ అధికారులు ప్రజలకు భారీ ఊరట కల్పించేందుకు రెడీ అయ్యారు. సుమారు 923.55 కోట్లను తిరిగి వినియోగదారులకు చెల్లించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఏపీఈఆర్‌సీ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. గత ప్రభుత్వ హయాంలో చాలా వరకు ట్రూఅప్‌ అనే పేరును మాత్రమే విన్న వినయోగదారులకు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తొలిసారి ట్రూడౌన్(ఛార్జీల తగ్గింపు)అనే మాటను వినబోతున్నారు అంటున్నారు అధికారులు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను డిస్కంలు దాఖలు చేసిన రూ.2,758.76 కోట్ల ట్రూఅప్‌ మొత్తానికి సంబంధించి.. ఏపీఈఆర్‌సీ రూ.1,863.64 కోట్లకు ఆమోదం తెలిపింది. కానీ డిస్కంలు 2024-25 ఆర్థిక సంవత్సరంలో వినియోగదారుల నుంచి రూ. 2,787 కోట్లు వసూలు చేశాయి. దీంతో ఆ మొత్తం నుంచి రూ. 1,863.64 కోట్లను మినహాయించి మిగిలిన రూ. 923.55 కోట్లను తిరిగి చెల్లించాలని ఏపీఈఆర్‌సీ ఆదేశించింది. దీంతో వినియోగదారులకు భారీ ఊరట లభించనుంది. అయితే ఈ మొత్తాన్ని ఎలా సర్దుబాటు చేస్తారంటే.. ట్రూడౌన్‌ చార్జీల రూపంలో మిగిలిన రూ. 923.55 కోట్లను ఈ సంవత్సరం నవంబర్ నుంచి వచ్చే ఏడాది అనగా 2026 అక్టోబర్ వచ్చే విద్యుత్ బిల్లుల్లో సర్దుబాటు చేస్తారు. దీని వల్ల యూనిట్‌కు 13 పైసలు చొప్పున వినియోగదారులకు లబ్ధి చేకూరనుంది. అయతే దీన్ని ప్రస్తుతం వచ్చే బిల్లులోని యూనిట్లపై అమలు చేస్తారు. 2024 ఏప్రిల్‌ నుంచి 2025 మార్చి వరకు వినియోగదారులు వినియోగించిన యూనిట్లకు వర్తింపచేసి.. ఆ మొత్తాన్ని ఇక మీదట రాబోయే బిల్లులో సర్దుబాటు చేస్తారు. అంటే గతేడాది 2024, ఏప్రిల్‌లో వినయోగదారులు 100 యూనిట్ల విద్యుత్తు వినియోగించారునుకుందాం. అప్పుడు 100 యూనిట్లకు 13 పైసల చొప్పున 13 రూపాయలు అవుతుంది. ఈ మొత్తాన్ని నవంబరు బిల్లులో సర్దుబాటు చేస్తారు. అనగా ఈ 13 రూపాయలు తగ్గించి మిగిలిన మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుందున్న మాట. ట్రూడౌన్‌ అంటే..ట్రూఅప్ అంటే ఛార్జీల పెంపు అయితే.. ట్రూడౌన్ అంటే తగ్గింపు కిందకు వస్తుంది. దీని ప్రకారం.. వాస్తవంగా డిస్కంలకు అనుమతించిన దాని కన్నా తక్కువ ఖర్చు అయితే.. డిస్కంల దగ్గర నుంచి ఆ మిగిలిన మొత్తాన్ని వసూలు చేసి.. దాన్ని వినయోగదారులకు సర్దుబాటు చేయాలని ఏపీఈఆర్‌సీ ఆదేశిస్తుంది. దీన్నే ట్రూడౌన్‌ అంటారు. విద్యుత్తు కొనుగోళ్ల అంశంలో కూటమి ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగా తొలిసారి రాష్ట్రంలో ట్రూడౌన్‌ ఛార్జీలను అమలు చేసే పరిస్థితి ఏర్పడిందని అధికారులు అంటున్నారు.