ఒక్కొక్కరికి రూ.25 వేలు.. ఉపాధి అవకాశాలు సైతం, తెలంగాణ పోలీసులు కీలక ప్రకటన

Wait 5 sec.

నిషేధిత మావోయిస్టు పార్టీని వీడి జనజీవన స్రవంతిలో కలిసేందుకు ముందుకు వచ్చే మావోయిస్టులకు తెలంగాణ ప్రభుత్వం పునరావాస విధానాన్ని అమలు చేస్తూ ఆర్థికంగా చేయూతనిస్తోందని ములుగు జిల్లా ఎస్పీ డాక్టర్‌ శబరీష్‌ తెలిపారు. ఈ విధానం దేశంలోనే అత్యుత్తమమైనదని ఆయన పేర్కొన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని పోలీసు కాన్ఫరెన్స్‌ హాలులో ఇటీవల లొంగిపోయిన మావోయిస్టులకు ఆయన రివార్డులను అందజేశారు. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రానికి చెందిన ముగ్గురు మావోయిస్టులకు ఈ సందర్భంగా ఆర్థిక సహాయం అందించారు. మే 7, 31 తేదీలలో లొంగిపోయిన మావోయిస్టు లీడర్లు, సభ్యులకు ఎస్పీ శబరీష్‌ చెక్కులను అందజేశారు.ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రానికి చెందిన ఏరియా కమిటీ సభ్యుడు మంగ్లీకి రూ. 3,75,000 రివార్డును అందజేశారు. ఏసీఎం స్థాయి నాయకుడిగా పనిచేసినందుకు ఆయనకు ఈ భారీ ఆర్థిక సహాయం అందించారు. మడకం కమలేశ్, మడకం భీమేలు పార్టీ సభ్యులుగా కొనసాగగా.. వారికి ఒక్కొక్కరికి రూ. 75 వేల చొప్పున రివార్డును అందజేశారు. మొత్తంగా ముగ్గురు లొంగిపోయిన మావోయిస్టులకు తెలంగాణ ప్రభుత్వం నుంచి రూ. 5,25,000 రివార్డులు అందినట్టు ఎస్పీ వెల్లడించారు.ఈ సందర్భంగా ఎస్పీ డాక్టర్‌ శబరీష్‌ మాట్లాడుతూ.. అజ్ఞాతం వీడిన మావోయిస్టులకు రివార్డుతో పాటు తక్షణ సహాయం కింద రూ. 25,000 చొప్పున అందిస్తున్నామని తెలిపారు. జనజీవన స్రవంతిలో కలిసిన మావోయిస్టులకు విద్య, ఉపాధి అవకాశాలను కల్పించడానికి కూడా ప్రభుత్వం, పోలీసు శాఖ కృషి చేస్తున్నాయని పేర్కొన్నారు. ములుగు జిల్లా పోలీసు యంత్రాంగం నిషిద్ధ మావోయిస్టులను ప్రధాన స్రవంతిలోకి రప్పించేందుకు కృషి చేస్తుందన్నారు. ముఖ్యంగా, సామాజిక మాధ్యమాల ద్వారా, కరపత్రాల ద్వారా, అలాగే కుటుంబ సభ్యుల ద్వారా కూడా వారికి ప్రభుత్వ పునరావాస పథకం గురించి ప్రచారం కల్పిస్తున్నట్లు చెప్పారు. అడవుల్లో ఎదుర్కొంటున్న కష్టాలు, అనారోగ్య సమస్యల కంటే, లొంగిపోవడం ద్వారా మెరుగైన జీవితం గడపవచ్చని నిరంతరం వారికి తెలియజేస్తున్నామన్నారు. ఇప్పటికీ అడవుల్లో ఉన్న మావోలు ఎవరైనా జనజీవనంలో చేరడానికి ముందుకు వస్తే.. పోలీసు శాఖ వారికి అన్ని విధాలా సహకరిస్తుందని ఎస్పీ వెల్లడించారు. వారికి భద్రత కల్పించి, మెరుగైన జీవితాన్ని అందించేందుకు కృషి చేస్తుందని భరోసా ఇచ్చారు.