ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు ఏపీ గృహనిర్మాణ శాఖ మంత్రి శుభవార్త చెప్పారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో లేఅవుట్లలో ఇచ్చిన ఇళ్ల స్థలాల్లో చాలా వరకు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. గత ప్రభుత్వం ఇచ్చిన సెంటు, సెంటున్నస్థలంలో చాలా మంది ఇంటి నిర్మాణం చేపట్టలేదని వెల్లడించారు. త్వరలోనే వారితో మాట్లాడి.. మళ్లీ వారికి కొత్తగా స్థలాలు కేటాయిస్తామని మంత్రి పార్థసారథి చెప్పుకొచ్చారు. వారందరికి పట్టణాల్లో అయితే 2 సెంట్లు, గ్రామాల్లో అయితే 3 సెంట్ల స్థలం కేటాయిస్తామని తెలిపారు. శనివారం శాసనసభలో దీనిపై ఆయన ప్రకటన చేశారు. అలానే గత ప్రభుత్వం పట్టణాలకు దూరంగా స్థలాలు ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం.. ఎన్టీఆర్‌ హౌసింగ్‌ కింద మంజూరైన 4 లక్షల ఇళ్లను రద్దు చేసిందని మంత్రి పార్థసారథి ఆరోపించారు. అలానే లబ్ధిదారులు కట్టుకున్న ఇళ్లకు నిధులు కూడా మంజూరు చేయలేదని తెలిపారు. అయితే కూటమి ప్రభుత్వం మాత్రం పీఎంఏవై 1.0 పథకం గడువు ముగిసిన్పటికీ కూడా.. 2026 మార్చి నాటికి ఇళ్లను పూర్తి చేస్తామని కేంద్రాన్ని ఒప్పించిందని తెలిపారు. అలానే పలువురు ఎమ్మెల్యేలు పట్టణాలకు దూరంగా ఉన్న స్థలాలను రద్దు చేసి, దగ్గరగా ఇవ్వాలని కోరారని తెలిపారు. అలానేఎమ్మెల్యేలు కన్నా లక్ష్మీనారాయణ, ఉగ్రనరసింహారెడ్డి, నారాయణరెడ్డి ఇంటి స్థలాల కేటాయింపుపై ప్రభుత్వానికి పలు సూచనలు చేశారు. దూరంగా కేటాయించిన ఇంటి స్థలాలను రద్దు చేసి.. పట్టణాలు, నగరాలకు దగ్గరగా ఉన్న స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. గత ప్రభుత్వంలో ఇళ్ల కోసం అధిక ధరలకు భూములు కొన్నారని దీనిపై విచారణ జరపాలని కోరారు. తప్పు చేసిన వారిని జైలుకు పంపాలని డిమాండ్ చేశారు.కడప ఎమ్మెల్యే మాధవి మాట్లాడుతూ.. కొందరు ఇతరుల ఆధార్‌ నంబర్లు తీసుకుని.. వాటితో ఇళ్లు మంజూరు చేయించుకున్నారని తెలిపారు. దీనివల్ల నిజమైన లబ్ధిదారులు ఇబ్బంది పడుతున్నారు. వారికి న్యాయం చేయాలని ఆమె కోరారు. ఇదిలా ఉంటే పేదల సొంతింటి కలను నిజం చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన ఎన్టీఆర్-పీఎంఏవైపై పీఎంఏవై ఇళ్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సాయం రూ.1.80 రాష్ట్ర ప్రభుత్వం బీసీ, ఎస్సీ మైనారిటీలకు రూ.50 వేలు అదనంగా సహాయం చేయాలని నిర్ణయించింది. అంటే మొత్తంగా రూ.2. 30 లక్షలు అవుతోంది. అదే ఎస్టీలకు రూ.75 వేలు ఆర్థిక సహాయం అదనంగా చేయాలని ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఈ లెక్కన మొత్తం రూ.2.55 లక్షల సహాయం లబ్ధిదారులకు వస్తుంది. ఇళ్లకు దశల వారీగా అంటే ఇళ్లు గ్రౌండింగ్ పనుల నుంచి పిల్లర్లు గోడలు, స్టాట్ పూర్తి చేసే వరకు వివిధ దశల్లో నిర్మాణ స్థాయిని తెలిపేలా ఫొటోలను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.