జీఎస్టీ తగ్గింపు.. ఏపీలో సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్, కేబినెట్ సబ్‌కమిటీతో సీఎం చంద్రబాబు సమావేశం

Wait 5 sec.

కేంద్ర ప్రభుత్వం గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (జీఎస్టీ)ని తగ్గిస్తూ ఇటీవల సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే కేంద్రం శ్లాబులను ఎత్తేయడం, కొన్ని వస్తువులపై ట్యాక్స్ తగ్గించడం వల్ల దేశ ప్రజలకు భారీగా ప్రయోజనం చేకూరుతుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే జీఎస్టీ తగ్గింపుతో ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు చేకూరే ప్రయోజనాలను, ఆర్థికంగా వచ్చే లాభాలను ప్రచారం చేసేందుకు నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్ పేరుతో ఒక కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు 4 జీఎస్టీ శ్లాబులు ఉండగా.. అందులో రెండు శ్లాబులను రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం.. రెండు శ్లాబులకే పరిమితం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే జీఎస్టీ మార్పులతో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చేకూరే ప్రయోజనాలను, ఆర్ధిక లాభాలను సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్ పేరిట ఒక కార్యక్రమం చేపట్టి.. రాష్ట్రంలోని ప్రతీ ఇంటికి వెళ్లి వివరించాలని సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఈ మేరకు ఏర్పాటైన రాష్ట్ర మంత్రివర్గ ఉప సంఘం సభ్యులతో ముఖ్యమంత్రి ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే నెల 19వ తేదీ వరకు 65 వేల సమావేశాలు, కార్యక్రమాలను నిర్వహించాలని ఈ సందర్భంగా కేబినెట్ సబ్‌కమిటీ నిర్ణయించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్, ఇతర ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. ఈ భేటీలో జీఎస్టీ తగ్గింపు ఫలితాలను ప్రతీ ఇంటికి చేరేలా ఏర్పాట్లు చేయాలని.. థీమ్‌ల వారీగా కార్యక్రమాలు నిర్వహించాలని వెల్లడించారు. జీఎస్టీ ప్రయోజనాలు ప్రతీ వర్గానికి, ప్రతీ ప్రాంతానికి చేరాలన్నారు. పర్యాటకం, ఆక్వా, విద్య, వ్యవసాయం, వైద్య రంగాల్లో ఈ జీఎస్టీ మార్పులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని చంద్రబాబు వెల్లడించారు.ప్రతీ జిల్లా కేంద్రాల్లో దీపావళి సంబరాలు నిర్వహించడం ద్వారా జీఎస్టీ తగ్గింపు లాభాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సీఎం చంద్రబాబు వివరించారు. జీఎస్టీ తగ్గింపు సంబరాల్లో విద్యార్థులను కూడా భాగస్వామ్యంగా చేయాలని సూచించారు.