తిరుపతి వెళ్లే ఆ ఎక్స్‌ప్రెస్ నంబర్, బయల్దేరే టైమింగ్స్ మారాయి.. ఇక సూపర్ ఫాస్ట్, 2 గంటల సమయం ఆదా

Wait 5 sec.

తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు ముఖ్యమైన గమనిక. ఇకపై ఆ ఎక్స్‌ప్రెస్ రైలు సూపర్ ఫాస్ట్‌‌గా నడవనుంది. తెలుగు రాష్ట్రాల నుంచి తిరుపతికి వెళ్లే భక్తులకు ప్రయాణ సమయం తగ్గనుంది. నేటి నుంచి త్రివేండ్రం-సికింద్రాబాద్‌-త్రివేండం మధ్య నడుస్తున్న శబరి ఎక్స్‌ప్రెస్‌ సూపర్‌ ఫాస్ట్‌గా నడుస్తోంది. గతంలో ఈ రైలు 17229/172230 నంబర్లతో నడవగా.. సూపర్ ఫాస్ట్‌గా మారిన తర్వాత 20629/20630 (శబరి ఎక్స్‌ప్రెస్‌ సూపర్ ఫాస్ట్) నంబర్లతో ఉంటుంది. ప్రయాణికులు ఈ మార్పుల్ని గమనించాలని రైల్వే అధికారులు కోరారు. శబరి సూపర్ ఫాస్ట్‌గా మార్చడంతో ప్రయాణికులకు దాదాపుగా రెండు గంటల ప్రయాణ సమయం ఆదా అవుతుందని చెబుతున్నారు. గతంలో త్రివేండ్రంలో ఉదయం 6.45 గంటలకు బయల్దేరేది.. సికింద్రాబాద్‌కు మరుసటి రోజు మధ్యాహ్నం 12.45 గంటలకు చేరుకునేది. సూపర్ ఫాస్ట్‌గా మారిన తర్వాత త్రివేండ్రంలో ఉదయం 6.45కు బయల్దేరి.. సికింద్రాబాద్‌కు మరుసటి రోజు ఉదయం 11 గంటలకు చేరుకుంటుంది. సికింద్రాబాద్‌ నుంచి ప్రతిరోజూ మధ్యాహ్నం 12.20గంటలకు బయల్దేరి.. త్రివేండానికి మరుసటి సాయంత్రం 6.05గంటలకు చేరుతుంది. సూపర్ ఫాస్ట్‌గా మార్చిన తర్వాత ప్రతిరోజూ మధ్యాహ్నం 2.25 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయల్దేరుతుంది. త్రివేండానికి మరుసటి రోజు సాయంత్రం 6.25 గంటలకు చేరుకుంటుంది.శబరి ఎక్స్‌ప్రెస్ సూఫర్ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌గా మారడంతో రెండు గంటల సమయం తగ్గడం వరకు ప్రయాణికులకు లాభమే. కానీ సూపర్ ఫాస్ట్ ఛార్జీల రూపంలో భారంకానుంది. సూపర్ ఫాస్ట్‌గా మారిన తర్వాత జనరల్‌ సెకండ్‌ క్లాస్‌ టికెట్‌ రూ.15 కాగా.. స్లీపర్‌, ఏసీ తరగతుల టికెట్లపై రూ.30 నుంచి రూ.40వరకు పెరిగింది. మొన్నటి వరకు శబరి ఎక్స్‌ప్రెస్‌ నిర్వహణ (మెయింటెనెన్స్‌) దక్షిణమధ్యరైల్వే ఆధ్వర్యంలో ఉండేది. ఇకపూ మెయింటెనెన్స్ బాధ్యతల్ని సదరన్‌ రైల్వే చేపట్టనుందని రైల్వే అధికారులు తెలిపారు. ఈ రైలు తిరుపతి మీదుగా నడుస్తుంది.. తెలంగాణ, ఏపీ నుంచి తిరుమల వెళ్లే భక్తులకు సౌకర్యంగా ఉంటుంది. ఈ శబరి సూపర్ ఫాస్ట్ రైలు త్రివేండ్రంలో బయల్దేరిన తర్వాత ఏపీలోని చిత్తూరు, తిరుపతి, రేణిగుంట, గూడూరు, నెల్లూరు, సింగరాయకొండ, ఒంగోలు, చీరాల, బాపట్ల, నిడుబ్రోలు, తెనాలి, గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, నడికుడి రైల్వే స్టేషన్‌లలో ఆగుతుంది. తెలంగాణలోని మిర్యాలగూడ, నల్గొండ, చర్లపల్లి, సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లలో ఆగుతుంది. తెలంగాణతో పోలిస్తే ఏపీలోనే ఎక్కువ రైల్వే స్టేషన్‌లలో ఆగుతుంది. అంతేకాదు శబరిమలకు వెళ్లే తెలుగు రాష్ట్రాల భక్తులకు కూడా ఈ శబరి సూపర్ ఫాస్ట్ రైలు ఉపయోగంగా ఉంటుంది. రైలు ప్రయాణికులకు ఈ షెడ్యూల్‌ను గమనించాలని సూచిస్తున్నారు అధికారులు.