ఏదైనా ఒక సినిమా హిట్టయితే, ఇండస్ట్రీలో కొన్నాళ్లపాటు అదే ట్రెండ్ కంటిన్యూ అవుతుంది. ఫిలిం మేకర్స్ అందరూ అదే జోనర్ లో సినిమాలు తీయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఇండియన్ సినిమాలో గత కొన్నేళ్లుగా 'మైథలాజికల్' ట్రెండ్ నడుస్తోంది. పురాణ గాథలను, దేవుళ్లు, దేవతల కథల తెర మీదకు తీసుకొస్తే.. భారతీయ ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. భాషతో సంబంధం లేకుండా నెత్తిన పెట్టుకుంటున్నారు. అయితే ఇప్పుడు మిథాలజీకి యానిమేషన్ తోడైంది. పౌరాణిక కథలను యానిమేషన్ బొమ్మల రూపంలో తెరపైకి తీసుకొచ్చే ట్రెండ్ మొదలైంది. ఈ నేపథ్యంలో 'మైథాలజీ + యానిమేషన్' సక్సెస్ ఫార్ములాపై ప్రత్యేక కథనం.. యానిమేషన్ చిత్రాలు.. చిన్న పిల్లలకు మాత్రమే కాదు..సాధారణంగా యానిమేషన్ సినిమాలు అనగానే 'చిన్న పిల్లల చిత్రాలు' అనే భావన వచ్చేస్తుంది. ఎందుకంటే యానిమేషన్స్ ను పిల్లలు బాగా ఇష్టపడతారు. ఫన్నీగా ఉండటంతో పాటు పాత్రలు బొమ్మల్లా కనిపించడం వల్ల తొందరగా వాటితో కనెక్ట్ అవుతారు. థియేటర్లలో అయినా, టీవీల్లో అయినా ఎంతో ఆసక్తికరంగా చూస్తారు. అందుకే యానిమేషన్ చిత్రాలను ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ కే పరిమితం చేశారు. అయితే ఇటీవల వచ్చిన ‘మహావతార్‌ నరసింహ’ సినిమా ఈ ధోరణిని పూర్తిగా మార్చేసింది. యానిమేషన్ చిత్రాలు అంటే పిల్లలకు మాత్రమే కాదని.. అన్ని వర్గాల ప్రేక్షకులు చూస్తారని నిరూపించింది. యానిమీ సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపిస్తాయని చాటిచెప్పింది. మహావతార్ నరసింహ గర్జన..నరసింహ పురాణం, విష్ణు పురాణం, శ్రీమద్ భాగవత పురాణం ఆధారంగా రూపొందిన యానిమేషన్ మూవీ 'మహావతార్ నరసింహ'. (MCU)లో మొదటి చిత్రంగా, జయపూర్ణ దాస్ రాసిన స్టోరీతో డైరెక్టర్ అశ్విన్‌ కుమార్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. హోంబలే ఫిల్మ్స్‌ బ్యానర్ పై నిర్మించిన ఈ మిథాలజీ యానిమేషన్ మూవీని జులై 25న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. తెలుగులో గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్ లో అల్లు అరవింద్‌ రిలీజ్ చేశారు. ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం.. బాక్సాఫీస్ దగ్గర ఎన్నో సంచలనాలకు కేంద్ర బిందువుగా మారింది. రూ.40 కోట్ల బడ్జెట్ ఖర్చు చేస్తే, ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా రూ. 320 కోట్లు వసూలు చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది.థియేటర్లలోనే కాదు.. ఓటీటీలోనూ..'మహావతార్ నరసింహ' సినిమా కన్నడలోనే కాదు, పాన్ ఇండియా స్థాయిలో ఘన విజయం సాధించింది. రోజురోజుకూ కలెక్షన్స్ పెంచుకుంటూ వెళ్లింది. ఓటీటీ రాజ్యమేలుతున్న టైంలో థియేటర్లలో 50 రోజులకుపైగా ప్రదర్శించబడింది. రూ. 300 కోట్ల క్లబ్ లో చేరడమే కాదు.. అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన ఇండియన్ యానిమేషన్‌ మూవీగా సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. యానిమేషన్‌ చిత్రాలకు కలెక్షన్స్ రావనే వాళ్లను నోళ్లు వెళ్లబెట్టేలా చేసింది. ఒక్క హిందీలోనే రూ.180 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించింది. థియేటర్లలోనే కాదు, ఓటీటీలోనూ సత్తా చాటింది. నెట్ ఫ్లిక్స్ ఓటీటీలోనూ కొన్ని వారల పాటు టాప్ ట్రెండ్స్లో కొనసాగుతోంది. యానిమేషన్‌లో దేవుడి కథలు..'మహావతార్ నరసింహ' సినిమా తెరకెక్కడం ఏమంత ఈజీగా జరగలేదు. దర్శకుడు అశ్విన్ కుమార్, ఆయన భార్య శిల్పా ధవన్‌ ఎన్నో కష్టనష్టాలు ఎదుర్కొని, వ్యయప్రయాసలు పడి ఈ చిత్రాన్ని రూపొందించారు. తాము నమ్మిన కథ కోసం తమ ఆస్తులన్నీ అమ్ముకున్నారు. అప్పుల మీద అప్పులు చేశారు. వీఎఫ్‌ఎక్స్‌ తో త్రీడీలో ప్రహ్లాదుడు - నరసింహస్వామి కథను తెర మీదకు తీసుకురావడానికి సంకల్పించారు. దాదాపు ఐదేళ్లపాటు ఈ ప్రాజెక్ట్ కోసం వర్క్ చేశారు. అద్భుతమైన సినిమా తీసి హిట్టు కొట్టారు. 'యానిమేషన్‌లో దేవుడి సినిమా తీయడం అంటే డబ్బు పోగొట్టుకోవడం తప్ప ఏమీ లేదు’ అన్నవాళ్లలోనే శభాష్ అనిపించుకున్నారు. త్రీడీలో వాయుపుత్ర..'మహావతార్‌ నరసింహ' విజయం ఇండియన్ సినిమాలో యానిమేషన్‌ చిత్రాలకు కొత్త ఊపునిచ్చింది. ఇప్పుడీ పంథాలో మరిన్ని కొత్త కథల్ని తెరకెక్కించేందుకు దర్శక నిర్మాతలు ఆసక్తి కనబరుస్తున్నారు. మైథాలజీకి యానిమేషన్ జోడించి ప్రేక్షకులకు సరికొత్త విజువల్ ఎక్స్ పీరియరన్స్ అందించడానికి కృషి చేస్తున్నారు. టాలీవుడ్ ఫిలిం మేకర్స్ కూడా ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ఇటీవల సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్ లో 'వాయుపుత్ర' అనే త్రీడీ యానిమేషన్‌ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. చందూ మొండేటి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనుంది. పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్..'వాయుపుత్ర'అనేది కేవలం సినిమా కాదని, థియేటర్లను దేవాలయాలుగా మార్చే పవిత్ర దృశ్యం అని మేకర్స్ పేర్కొన్నారు. హనుమంతుడి కాలాతీత కథను గొప్ప దృశ్య కావ్యంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నామని తెలిపారు. టైటిల్ అనౌన్స్ మెంట్ పోస్టర్ లో హనుమంతుడు ఓ కొండపై నిలబడి లంకాదహనాన్ని చూస్తున్నట్లుగా చూపించారు. భారీ స్థాయిలో ఈ యానిమేషన్ మూవీని రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్నారు. తెలుగుతో పాటుగా హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నారు. 2026 దసరా పండక్కి థియేటర్లలో రిలీజ్ చేస్తారు. మహావతార్ సినిమాటిక్ యూనివర్స్ లో మరికొన్ని చిత్రాలు..మహావతార్ సినిమాటిక్ యూనివర్స్ లో మరో ఏడు సినిమాలు రూపొందించనున్నట్లు హోంబలే సంస్థ ఇది వరకే ప్రకటించింది. రెండేళ్లకో సినిమాని విడుదల చేయనున్నట్లు తెలిపారు. భవిష్యత్ లో 'మహావతార్ పరశురామ్' (2027), 'మహావతార్ రఘునందన్' (2029), 'మహావతార్ ద్వారకాధీష్' (2031), 'మహావతార్ గోకులానంద' (2033), 'మహావతార్ కల్కి పార్ట్ 1' (2035), 'మహావతార్ కల్కి పార్ట్ 2' (2037) వంటి మైథాలజీ యానిమేషన్ సినిమాలు రాబోతున్నాయి.నెట్‌ఫ్లిక్స్ కురుక్షేత్ర..ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ 'కురుక్షేత్ర' అనే పేరుతో యానిమేటెడ్ మైథాలజీ సిరీస్ రూపొందిస్తోంది. ఇది నెట్‌ఫ్లిక్స్ ఇండియా మొట్టమొదటి పౌరాణిక అనిమే సిరీస్. మహాభారతం ఇతిహాసం ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. 2025 అక్టోబర్ 10వ తేదీ నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది. అలానే ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో హనుమాన్ తో సహా కొన్ని ఐకానిక్ పాత్రలను యానిమేషన్స్ లో తీర్చిదిద్దుతున్న సంగతి తెలిసిందే. యానిమేషన్‌ ‘స్త్రీ’..మైథాలజీ + యానిమేషన్ సినిమాలే కాకుండా.. మరికొన్ని యానిమేషన్ చిత్రాలు కూడా భారతీయ ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నాయి. ఇటీవల 'డెమన్ స్లేయర్ ఇన్ఫినిటీ కాజిల్' అనే జపనీస్ అనిమే మూవీ ఇండియాలోనూ భారీ వసూళ్లను రాబట్టింది. అంతకముందు 'ముసఫా: ది లయన్ కింగ్' వంటి యానిమేషన్ మూవీస్ ఘన విజయం సాధించాయి. మడాక్‌ హారర్‌ కామెడీ యూనివర్స్‌లో భాగంగా 'ఛోటా స్త్రీ' అనే యానిమేషన్‌ మూవీ రానుందని బాలీవుడ్‌ హీరోయిన్ శ్రద్ధా కపూర్‌ తాజాగా ప్రకటించింది. ఇది ‘స్త్రీ’ పాత్ర నేపథ్యానికి సంబంధించిన ప్రశ్నలన్నింటికీ సమాధానం ఇస్తుందని...‘స్త్రీ 3’ విడుదలకు ఆరు నెలలకు ముందే థియేటర్లలోకి తీసుకొస్తామని నిర్మాత దినేష్ విజన్‌ తెలిపారు.