తొక్కిసలాటలు ఎందుకు జరుగుతున్నాయి..? ఇలా జరిగినప్పుడు ప్రాణాలు కాపాడుకోవడానికి ఏం చేయాలి?

Wait 5 sec.

సముద్రం ఉప్పొంగలేదు, అగ్ని కీలలు ఎగసి పడలేదు, గాలివాన బీభత్సం సృష్టించలేదు, ఏ వాహనానికి ప్రమాదం జరగనూ లేదు. కానీ ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే 38 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. శనివారం (సెప్టెంబర్ 27) తమిళనాడులోని కరూర్‌లో నటుడు, టీవికే పార్టీ అధినేత విజయ్‌ ప్రచార సభలో జరిగిన తొక్కిసలాట అంతులేని విషాదం మిగిల్చింది. ఈ ఘటనలో మరో 50 మందికి పైగా గాయాలపాలయ్యారు. మృతుల్లో పిల్లలు కూడా ఉండటం గుండెలను పిండేస్తోంది. అయితే ఇది ఎక్కడో ఒక చోట, ఎప్పుడో ఒకసారి జరిగిన ఘటన కాదు. ఈ ఏడాది జనవరి మొదలు ఇప్పటి దాకా.. దేశవ్యాప్తంగా జరిగిన తొక్కిసలాటల్లో అనేక మంది మృత్యువాతపడ్డారు. వేడుకగా నిర్వహించే కార్యక్రమాలే.. మృత్యుకూపాలుగా మారుతుండటంపై సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో భారత్‌లో తరచుగా ఇలాంటి తొక్కిసలాటలు ఎందుకు జరుగుతున్నాయి? నిర్వాహకులు చేస్తున్న తప్పిదాలేంటి? వీటిని అరికట్టాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. 2025 జనవరిలో మహాకుంభ మేళాలో తొక్కిసలాట జరిగింది. జనవరి 29న మౌని అమావాస్య సందర్భంగా పవిత్ర స్నానాలు ఆచరించడానికి భక్తులు వచ్చిన క్రమంలో తొక్కిసలాట జరిగి 30 మంది మృతిచెందారు. 60 మందికిపైగా క్షతగాత్రులయ్యారు. ఆ తర్వాత ఫిబ్రవరిలో ఢిల్లీలోని రైల్వేస్టేషన్‌లో జరిగిన తొక్కిసలాటలో మహిళలు, పిల్లలు సహా 18 మంది చనిపోగా మరో 20 మందికిపైగా గాయపడ్డారు. మేలో గోవాలోని శ్రీ లైరై దేవి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు, జూన్‌లో ఆర్సీబీ ఐపీఎల్ టైటిల్ గెలిచిన సందర్భంగా బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వద్ద చేపట్టిన విజయోత్సవ ర్యాలీలో తొక్కిసలాట జరిగి 11 మంది ప్రాణాలు కోల్పోయారు. 33 మంది గాయపడ్డారు. ఇదే నెల.. పూరి రథయాత్రలో ముగ్గురు చనిపోయారు. సెప్టెంబర్ 27న కరూర్‌లో 8 మంది పిల్లలతో సహా 38 మంది తొక్కిసలాటకు బలయ్యారు. తొక్కిసలాటలు ఎందుకు జరుగుతున్నాయి?అప్పటివరకు ఆహ్లాదంగా ఉన్న ప్రదేశాలు.. తొక్కిసలాటతో మృత్యుకూపాలుగా మారుతున్నాయి. దీనికి సాధారణంగా.. క్రౌడ్‌లో ఉండే ప్యానిక్ కారణం అని నిపుణులు చెబుతున్నారు. అయితే ఫోరెన్సిక్ సమీక్షలు, పరిశోధనల వివరాల ప్రకారం తొక్కిసలాటలకు ముఖ్య కారణం.. ప్రమాదకర రీతిలో జన సాంద్రత (dangerous crowd density) ఉండటమే అని తెలుస్తోంది. ఒక చదరపు మీటర్ ప్రదేశంలో సాధారణంగా 5-7 మంది ఉండాల్సింది.. అంతకంటే ఎక్కువగా కుక్కినట్లుగా ఉండటం, కాలు కదిపే అవకాశం కూడా లేకపోవడం వల్ల.. తో పరిస్థితి దగజారుతోంది. మనం నీళ్లను చిన్నగా తాకితే ఎలా అలలు ఏర్పడతాయో.. మొత్తం ప్యాక్డ్‌గా ఉన్న జనాన్ని ఎవరైనా చిన్నగా తోసినా.. అది పలు రెట్లు పెరిగి కిందపడిపోతారు. అనంతరం ఇతరులు ప్యానిక్ అవుతూ.. అటు ఇటు పరుగెడుతూ తప్పించుకోవడానికి ప్రయత్నిస్తారు. ఈ క్రమంలో కింద పడిపోయిన వారు.. మిగతా వాళ్ల కాళ్ల కింద చిక్కుకుపోయి, ఊపిరాడక ప్రాణాలు కోల్పోతారు.రాజకీయ పార్టీల సభలు, సినిమా వేడుకలు, రవాణా ప్రాంతాల్లో ఇలాంటి తొక్కిసలాటలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇలాంటి కార్యక్రమాల్లో కొన్ని సందర్భాల్లో పుకార్లు ప్యానిక్‌ను సృష్టిస్తున్నాయి. అది తొక్కిసలాటలకు దారి తీస్తోంది.నిర్వాహకులు చేస్తున్న తప్పిదాలేంటి?క్రౌడ్ కంట్రోల్ విషయంలో నిర్వహకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. సరైన ఎంట్రీ, ఎగ్జిట్ ప్లానింగ్.. కార్యక్రమం జరిగే ప్రదేశంలో లైనింగ్స్, బ్యారికేడ్లు లేకపోవడం తొక్కిసలాటలకు దారితీస్తోంది. ఇక జనం ఎక్కువగా వచ్చే ఈవెంట్లలో క్రౌడ్ మేనేజర్లను మోహరించడం లేదు. కొన్ని సందర్భాల్లో పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకునేందుకు వారికి ట్రైనింగ్, అనుమతి ఇవ్వడం లేదు. ఒకవేళ వలంటీర్లను నియమించినా.. వారికి ప్రమాదకర జనసాంద్రత గురించి అవగాహన లేక క్రౌడ్‌ను కంట్రోల్ చేయలేకపోతున్నారు. ఫలితంగా తొక్కిసలాటలకు దారితీస్తోంది. వివిధ కార్యక్రమాల్లో లీడర్లు, పూజలు, దర్శనం అంటూ.. జనాలను ఎక్కువ సమయం వెయిట్ చేయిస్తున్నారు. తాజాగా కరూర్‌లో విజయ్ కోసం కూడా అభిమానులు దాదాపు 6 గంటలు ఎదురుచూడాల్సి వచ్చింది. ఇలా జరిగినప్పుడు ప్రజల్లో అసహనం పెరుగుతుంది. కుంభమేళా లాంటి ప్రదేశాల్లో సీసీటీవీలు, క్రౌడ్‌ను సూచించే సెన్సార్లు ఏర్పాటు చేసినా.. అవి ఇచ్చిన డేటా ఆధారంగా నిర్ణయం తీసుకోవడంలో నిర్వాహకులు విఫలం అయ్యారు. ఏదైనా అనుకోని సంఘటన జరిగితే.. అంబులెన్స్‌లు రావడానికి, జనాలు పారిపోవడానికి సరైన మార్గాలు ఉండటం లేదు.వీటిని అరికట్టాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి?ఇంత మంది ప్రాణాలు తీస్తున్న ఇలాంటి తొక్కిసలాటలను సీరియస్‌గా పరిగణించాలి. అవసరమైతే నిర్వాహకులు పటిష్ట భద్రత చర్యలు తీసుకునేలా చట్టాలు రూపొందించాలి. ఆర్సీబీ ఘటన తర్వాత కర్ణాటక ప్రభుత్వం క్రౌడ్ కంట్రోల్ బిల్ 2025 తీసుకొచ్చింది. రాజకీయ, సినిమా, మతపరమైన కార్యక్రమాలకు అనుమతులు ఇచ్చేటప్పుడు.. నిర్వాహకులకు.. వారు తీసుకోవాల్సిన భద్రత చర్యల గురించి వివరించాలి. అంతర్జాతీయంగా అమలులో ఉన్న భద్రత ప్రమాణాలు పాటించేలా చేయాలి. లేదంటే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించాలి. కార్యక్రమం ఏర్పాటు చేసే ప్రదేశానికి అనుగుణంగా జన సమూహానికి (అంచనాలు కాదు, శాస్త్రీయంగా లెక్కించాలి) అనుమతించాలి. అలాగే ఇండిపెండెంట్ నిపుణులు ధ్రువీకరించిన క్రౌడ్ మేనేజ్‌మెంట్ ప్లాన్లను నిర్వాహకులు అధికారులకు ముందే సమర్పించేలా చర్యలు చేపట్టాలి. ప్రజలు ఇలా చేస్తే సేఫ్..!ఇలాంటి కార్యక్రమాల్లో మన భద్రత కేవలం నిర్వాహకులపై మాత్రమే లేదు. మన గురించి కూడా మనం జాగ్రత్తలు తీసుకోవాలి.ఇలాంటి కార్యక్రమాలకు వెళ్లాలనుకుంటున్నవారు.. వీలైతే ముందుగా లేదా ఆలస్యంగా వెళ్లాలి. జనం ఎక్కువగా ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉండాలి, ఎవరినీ ముందుకు తోయకూడదు. ఈవెంట్లలో బయటకు వెళ్లే దారులు ఎటు వైపు ఉన్నాయో తెలుసుకోవాలి.అనూహ్యంగా తొక్కిసలాటలో చిక్కుకున్నప్పుడు.. చేతులు చెస్ట్‌పై పెట్టుకోవాలి. ఇలా చేస్తే ఊపిరి తీసుకోవచ్చు. ఒకవేళ కింద పడిపోతే.. తల, మెడ కవర్ అయ్యేటట్లు చేతులు అడ్డుపెట్టుకుని ముడుచుకుపోవాలి. వీలైనంత త్వరగా పైకి లేచేందుకు ప్రయత్నించాలి.మతపరమైన కార్యక్రమం అయినా, రాజకీయ ప్రచార సభ అయినా, సినిమా ఈవెంటైనా.. అధిక సంఖ్యలో జనం పాల్గొంటారు. ఇలాంటి భారీ సమావేశాలకు భారత్ ప్రసిద్ధి. అయితే ఇలాంటి కార్యక్రమాల్లో నిర్వహణ లేమితో తొక్కిసలాటలు జరిగి అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అలా జరగకుండా ఉండాలంటే.. నిర్వాహకులు జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. సరైన సౌకర్యాలను ఏర్పాటు చేసి జనం భద్రతకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి. క్రౌడ్ మేనేజర్లకు సరైన శిక్షణ ఇవ్వాలి. ఇక కరూర్ ఘటనను దేశవ్యాప్తంగా ప్రభుత్వాలు ఒక మేల్కొలుపుగా పరిగణించి పటిష్ట చర్యలు చేపట్టాలి. ప్రభుత్వాలు మెరుగైన చట్టాలను రూపొందించాలి. ఎక్కువమంది ప్రజలు హాజరయ్యే సభలు, కార్యక్రమాలకు.. సరైన ప్లానింగ్ ఉంటేనే అనుమతులు ఇవ్వాలి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే భవిష్యత్తులో కరూర్ లాంటి దుర్ఘటనలను నివారించడానికి వీలవుతుంది.