పాకిస్థాన్ అంటే పేరుకే ప్రజాస్వామ్య దేశం. కానీ ఆ దేశ పాలన అంతా ఆర్మీ కనుసన్నల్లోనే నడుస్తుందన్నది బహిరంగ రహస్యం. అమెరికా లాంటి దేశాలు కూడా పాక్ ప్రధానిని కాకుండా ఆర్మీ చీఫ్‌తోనే చర్చలు జరుపుతుంటారు. ప్రపంచం మొత్తానికి తెలిసిన ఈ విషయాన్ని పాక్ ఎప్పుడూ అంగీకరించదు. కానీ ఇప్పుడే అదే విషయాన్ని పాక్ రక్షణమంత్రి స్వయంగా అంగీకరించారు. తమ దేశంలో హైబ్రిడ్ మోడల్ పాలన ఉందని వెల్లడించారు. ఆర్మీ, ప్రభుత్వం కలిసే పాలన సాగిస్తుంటాయని చెప్పుకొచ్చారు. ఈ మేరకు ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు ఖవాజా.పాకిస్థాన్‌లో ప్రజాస్వామ్యం, మానవ హక్కుల ఉల్లంఘనలపై తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రస్తుత తరుణంలో, ఆ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ స్థాయిలో చర్చకు దారి తీశాయి. ఒక బ్రిటిష్-అమెరికన్ జర్నలిస్ట్ మెహదీ హసన్‌తో జరిపిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు."పాకిస్తాన్‌లో సైన్యం, పౌర నాయకులు అధికారాన్ని పంచుకునే ఒక వింత వ్యవస్థ ఉంది. మీరు దీన్ని హైబ్రిడ్ మోడల్ అని పిలుస్తారు. కానీ, నిజానికి సైనిక నాయకులే ఇక్కడ బాధ్యులు కదా? చాలా దేశాల్లో సైన్యాధిపతి రక్షణ మంత్రికి జవాబుదారీగా ఉంటారు. కానీ మీ దేశంలో మీరు (రక్షణ మంత్రి) ?" అని సూటిగా జర్నలిస్ట్ ప్రశ్నించారు. దీనికి బదులుగా మంత్రి ఖవాజా ఆసిఫ్.. "అలాంటిది ఏమీ లేదు. నేను ఎన్నికల ద్వారా అధికారంలోకి వచ్చిన రాజకీయ నాయకుడిని" అని సమాధానం ఇచ్చారు.అమెరికాలో రక్షణ శాఖ బాధ్యతలు చూసే వారికి ఆ దేశ సైనిక జనరళ్లను విధుల నుంచి తొలగించే అధికారం ఉంది. కానీ పాకిస్థాన్‌లో అది సాధ్యమవుతుందా అని జర్నలిస్టు ప్రశ్నించగా.. అమెరికా పాలనా విధానానికి, పాకిస్థాన్ పాలనా విధానానికి తేడాలు ఉన్నాయని అదే హైబ్రిడ్ మోడల్‌ అంటూ ఖవాజా సమర్థించుకున్నారు. అమెరికాలో 'డీప్ స్టేట్' అనే భిన్నమైన మోడల్ ఉందంటూ తప్పించుకునే ప్రయత్నం చేశారు. దేశంలో అధికారం ఎక్కడ కేంద్రీకృతమై ఉందన్న ప్రశ్నకు.. ఆసిఫ్ పాకిస్థాన్‌ది హైబ్రిడ్ మోడల్ అని స్పష్టం చేశారు. ఈ ఏడాది ప్రారంభంలో కూడా ఖవాజా ఆసిఫ్ ఈ హైబ్రిడ్ పాలనకు మద్దతుగా మాట్లాడారు. ఇది ఆదర్శవంతమైన ప్రజాస్వామ్య ప్రభుత్వం కానప్పటికీ.. దేశ ఆర్థిక, పాలనా సమస్యలు పరిష్కారమయ్యే వరకు ఇది ఒక "ఆచరణాత్మక అవసరం" అని ఖవాజా గతంలో వ్యాఖ్యానించారు.అంతర్జాతీయ వేదికలపై, అమెరికా లాంటి దేశాలతో చర్చల్లోనైనా పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కంటే పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ ఎక్కువగా కనిపిస్తుంటారు. ఆసిమ్ మునీర్ ఈ మధ్యకాలంలోనే పలుమార్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో భేటీ అయిన సంగతి తెలిసిందే.