భారత్‌కు పొరుగున ఉన్న చైనా, పాకిస్తాన్ వంటి దేశాలతో తీవ్ర ఉద్రిక్తతలు, ఘర్షణ పూరిత వాతావరణం నెలకొంటున్న వేళ.. భారత సైన్యం భారీగా ఆయుధ సంపత్తిని పోగు చేసుకుంటోంది. ఈ క్రమంలోనే ఇప్పటికే సైన్యానికి కావాల్సిన ఆయుధాలు, ఇతర యుద్ధ సామాగ్రిని అందించేందుకు భారీగా ఖర్చు చేస్తోంది. ఇటీవల పాకిస్తాన్‌తో ఉద్రిక్తతల సందర్భంగా నిర్వహించిన ఆపరేషన్ సిందూర్‌ సమయంలో భారత ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ ధాటికి పాకిస్తాన్ పప్పులు ఉడకలేదు. పాక్ చేసిన దాడులను.. ముందే గుర్తించిన భారత వైమానిక రక్షణ వ్యవస్థ.. వాటిని గాల్లోనే కూల్చేసింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు చైనా, పాకిస్తాన్ సరిహద్దుల్లో వైమానిక రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు భారత సైన్యం కీలక చర్యలు చేపట్టింది. అనంత్ శస్త్ర అనే ఉపరితలం నుంచి గగనతలంపైకి దూసుకెళ్లే స్వదేశీ క్షిపణి వ్యవస్థ కోసం టెండర్లు జారీ చేసింది.సుమారు రూ.30 వేల కోట్ల అంచనా వ్యయంతో ఈ అనంత్ శస్త్ర ప్రాజెక్ట్‌ను చేపట్టనున్నారు. క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్ పేరుతో ఇదివరకు పిలిచిన ఈ వ్యవస్థను డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీఓ) అభివృద్ధి చేయనుంది. సమయంలో పాకిస్తాన్ డ్రోన్ దాడులను అడ్డుకోవడంలో ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కీలక పాత్ర పోషించింది. ఈ అనుభవాల దృష్ట్యా.. సరిహద్దుల్లో మరింత సమర్థవంతమైన వాయు రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏర్పడింది. అందుకే రక్షణ కొనుగోళ్ల మండలి ఈ స్వదేశీ వాయు రక్షణ వ్యవస్థ కొనుగోలుకు అనుమతులు ఇచ్చింది.అనంత్ శస్త్ర ప్రత్యేకతలుఈ అనంత్ శస్త్ర ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ సుమారు 30 కిలోమీటర్ల రేంజ్‌ను కలిగి ఉంటుంది. అనంత్ శస్త్ర వ్యవస్థలు అత్యంత వేగంగా కదిలే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఇవి ప్రయాణం చేస్తూనే టార్గెట్లను గుర్తించి వాటిని ట్రాక్ చేస్తాయి. అంతేకాకుండా తక్కువ సమయం ఆగి కాల్పులు జరుపుతాయి. ఇక ఈ ప్రాజెక్టుకు ఆమోదం లభించిన తర్వాత.. ఈ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను పాకిస్తాన్, చైనా సరిహద్దుల్లో మోహరించనున్నారు.ప్రస్తుతం ఆర్మీ ఉపయోగిస్తున్న మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్.. ఆకాశ్ వంటి మధ్యస్థ.. చిన్న శ్రేణి వ్యవస్థలకు ఈ అనంత్ శస్త్ర ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ అదనపు బలాన్ని అందిస్తుందని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు. మరోవైపు.. ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్‌తో జరిగిన 4 రోజుల ఘర్షణలో భాగంగా.. భారత సైన్యం ఎయిర్ డిఫెన్స్ యూనిట్లు.. చైనా ఆయుధాలను ఉపయోగించిన పాక్ డ్రోన్లలో చాలావరకు ఎల్-70, Zu-23 వంటి ఎయిర్ డిఫెన్స్ గన్స్ ద్వారా నాశనం చేశాయి. ఆ సమయంలో ఆకాష్, మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్, అలాగే ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన స్పైడర్, సుదర్శన్ ఎస్-400 వ్యవస్థలు కూడా కీలక పాత్ర పోషించాయి.సైన్యంలో, ఆయుధాల్లో స్వదేశీకరణను పెంచేందుకు ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది తీవ్రంగా కృషి చేస్తున్నారు. దీనిలో భాగంగా.. ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ విభాగం పాక్ సైన్యం వద్ద ఉన్న టర్కిష్, చైనీస్ డ్రోన్లను ఎదుర్కోవడానికి కొత్త రాడార్లు, అతి తక్కువ శ్రేణి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌లు, జామర్లు, లేజర్ ఆధారిత వ్యవస్థలను కూడా సమకూర్చుకుంటోంది. భవిష్యత్తులో జోరావర్ లైట్ ట్యాంక్ వంటి స్వదేశీ వ్యవస్థలు కూడా ఇండియన్ ఆర్మీలో చేరే అవకాశం ఉంది.