ఆంధ్రప్రదేశ్‌లో మాజీ శాసనసభ్యుల కనీస నెలవారీ పింఛను పెంపు దిశగా అడుగులు పడుతున్నాయి. మాజీ ఎమ్మెల్యేల పింఛన్‌ రూ.30 వేల నుంచి రూ.50 వేలకు పెంచేలా ప్రతిపాదించారు. ఈ మేరకు సదుపాయాల కమిటీ చేసిన సిఫార్సుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ద్రవ్యోల్బణం, ఇతర రాష్ట్రాల్లోని పింఛను వివరాలు, కొందరు మాజీ ఎమ్మెల్యేల ఆర్థిక పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. స్పీకర్‌ ఆదేశాలతో ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి ఈ నివేదికను సభలో చదివి వినిపించారు. సభ్యుల జీతభత్యాలు చివరిసారిగా 2016లో సవరించారని ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు.శాసనసభ సదుపాయాల కమిటీ సమావేశమై కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు. స్పీకర్‌ అయ్యన్నపాత్రుడి ఆదేశాల మేరకు, అనపర్తి ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి శనివారం సభలో కమిటీ నివేదికను చదివారు. ఈ పింఛను పెంపునకు గల కారణాలను నివేదికలో వివరించారు. మణిపుర్‌లో మాజీ శాసనసభ్యులకు కనీసం రూ.70 వేలు పింఛను ఇస్తున్నారని తెలిపారు. పంజాబ్, అరుణాచల్‌ప్రదేశ్‌లలో రూ.60 వేలు, హర్యానా, తెలంగాణలో రూ.50 వేలుగా ఉందని పేర్కొన్నారు. ఈ వివరాలను కమిటీ పరిగణనలోకి తీసుకుంది. ద్రవ్యోల్బణం పెరిగిన విషయాన్ని కూడా గమనించారు. కొందరు మాజీ ఎమ్మెల్యేల ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉండడాన్ని గుర్తించారు.ఈ కారణాలన్నింటినీ దృష్టిలో ఉంచుకుని, ఏపీలో మాజీ శాసనసభ్యుల కనీస నెలవారీ పింఛను రూ.30 వేల నుంచి రూ.50 వేలకు పెంచాలని సిఫార్సు చేశారు. అలాగే, గరిష్ఠంగా రూ.70 వేలకు మించకుండా పరిమితం చేయాలని కూడా సూచించారు. ప్రస్తుత, మాజీ సభ్యులకు అఖిలభారత సర్వీసు అధికారులతో సమానంగా వైద్య సదుపాయాలు ఇవ్వాలని కమిటీ సిఫార్సు చేసింది. ఈ నివేదికను సభ ఆమోదించింది. దీనిని ప్రభుత్వ పరిశీలనకు పంపాలని నిర్ణయించారు. ఈ నివేదికపై సభలో చర్చించాలా వద్దా అని ముందు కొంత చర్చ జరిగింది. ఈ నివేదికను సభలో ప్రవేశపెట్టామని అంటే సరిపోతుందని.. ప్రభుత్వం నుంచి బిల్లుగా వచ్చాక సభలో దీనిపై చర్చించవచ్చన్నారు. అయితే స్పీకర్ అయ్యన్నపాత్రుడు కమిటీ నివేదిక ఏమిటో సభ్యులందరికీ తెలియజేయాలని.. అందుకే ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డితో సభలో ఆ నివేదికను చదివించామన్నారు.